ఆట ఆరంభం అదిరింది | - | Sakshi
Sakshi News home page

ఆట ఆరంభం అదిరింది

Published Wed, Dec 25 2024 1:58 AM | Last Updated on Wed, Dec 25 2024 1:58 AM

ఆట ఆర

ఆట ఆరంభం అదిరింది

2024 ప్రారంభంలో ఆట అదిరింది. క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం క్రీడలను పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వం ఏడాది ప్రారంభంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అలాగే ఏలూరు ఇండోర్‌ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అభివృద్ధి పనులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను అటకెక్కించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ క్రీడా పురస్కారాలు పథకం నిలిపేశారు. ఏలూరులో ఇండోర్‌ స్టేడియం పైకప్పు కూలి నెలలు గడుస్తున్నా మరమ్మతుల ఊసేలేదు. మరోవైపు జిల్లా క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో సత్తా చాటారు.

ఏలూరు రూరల్‌: 2024 ఏడాది ప్రారంభంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారు. జనవరి 30 వరకూ సుమారు 36 రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగాయి. జిల్లా స్థాయిలో లక్షలాది మంది బాలబాలికలు, క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అధికారులు 320 ఆటస్థలాలు ఏర్పాటుచేశారు. 1.47 లక్షల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వీరిని జట్లుగా విభజించి కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, వాలీబాల్‌, బాడ్మింటన్‌ అంశాల్లో మ్యాచ్‌లు నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలు బంపర్‌ బహుమతులు అందుకున్నారు. రూ.15.50 లక్షల నగదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్రీడాకారులకు అందించింది. నియోజకవర్గ స్థాయిలో మొదట మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.20 వేలు, రూ. 10 వేలు, రూ.5 వేలు కాగా, జిల్లా స్థాయిలో రూ.35 వేలు, రూ.20.వేలు, రూ.10 వేలు అందించారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి క్రీడా పరికరాలు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్‌లో మరోసారి క్రీడా వికాస కేంద్రాలను తెరపైకి తెచ్చింది. జిల్లాలో 9కి పైగా వికాస కేంద్రాలు ఉండగా నేటికీ ఒక్క కేంద్రానికి కూడా నిధులు విడుదల చేయలేదు. ఏలూరు ఇండోర్‌ స్టేడియం కూలిపోయింది. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పన పక్కన పడేశారు.

బ్యాడ్మింటన్‌, క్రికెట్‌లో విజయం

పలువురు క్రీడాకారులు క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించి జిల్లాకు పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఏలూరు జిల్లా పురుషుల జట్టు ఫైనల్‌లో తిరుపతి జిల్లా జట్టుతో తలపడింది. జిల్లా క్రీడాకారులు 17–20, 21–16, 17–21 స్కోర్‌ తేడాతో తిరుపతి జట్టను ఓడించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌ వెలుతురుతో జరిగిన క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏలూరు జిల్లా పురుషుల జట్టు విశాఖపట్నం జట్టుతో తలపడింది. ఏలూరు జట్టు 128 పరుగులు లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకాలు

ఏలూరు ఖేలో ఇండియా సెంటర్‌ బాలికలు రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాలు సాధించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 8 వరకూ ఆంధ్రప్రదేశ్‌, కేరళ, అనకాపల్లి, యానాంలో జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఎం.పావని, సీహెచ్‌ కీర్తన, జి పవిత్ర, సీహెచ్‌ హారికారెడ్డి మూడు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. కేరళ రాష్ట్రం త్రిసూర్‌లో జరిగిన కేరళ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రేణు మోల్‌, పి.దివ్య రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాదించారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరిలో జరిగిన పోటీల్లో జి.సాహితి రెండు బంగారు, ఒక రజతం, ఎస్‌ వర్షిణి బంగారు, ఏ తేజశ్రీ రజత పతకాలు సొంతం చేసుకున్నారు.

ఆడుదాం ఆంధ్ర పోటీలతో క్రీడాకారుల్లో ఉత్సాహం

కూటమి ప్రభుత్వంలో ‘ఆడుదాం ఆంధ్ర’, క్రీడా పురస్కారాలు బంద్‌

తెరపైకి వికాస కేంద్రాలు.. నిధులు మాత్రం నిల్‌

జాతీయ స్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులు

అటకెక్కిన వైఎస్సార్‌ క్రీడా పురస్కారాలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్‌ క్రీడా పురస్కారాలు, నగదు పోత్సా హకాల పథకం కూటమి ప్రభుత్వం నిలిపేసింది. 2019 నుంచి 2024 వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం పురస్కారాల పేరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులకు రూ.97.34 లక్షల నగదు అందించింది. జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్‌ సాధిచిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.3 లక్షలు, కాంస్య సొంతం చేసుకున్నవారికి రూ.2.5 లక్షలు అందించారు.

స్విమ్మింగ్‌లో మెరుపులు

ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో జరిగిన కేంద్రీయ విద్యాలయాల స్విమ్మింగ్‌ పోటీల్లో గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 7 బంగారు పతకాలు, 5 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు. విశాఖపట్నంలో జరిగిన 9వ ఆంధ్రప్రదేశ్‌ సబ్‌జూనియర్‌, జూనియర్‌ వింటర్‌ ఆక్వాటెక్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో బి.స్వామినాయుడు 4 బంగారు పతకాలు అందుకున్నాడు. అలాగే మిగతా స్విమ్మర్లు 5 స్వర్ణ, 10 రజత, 17 కాంస్య పతకాలు సాధించారు.

బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ

జిల్లా బాలబాలికలు బాస్కెట్‌బాల్‌ పోటీల్లో రాణించారు. ఏడాది ప్రారంభంలో చత్తీస్‌గఢ్‌లో జరిగిన అండర్‌–17 స్కూల్‌ గేమ్స్‌ జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఏలూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలు ఏ రుత్విక, జి.పూజిత పాల్గొ న్నారు. కోల్‌కతాలో జరుగుతున్న 39వ జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఏలూరుకు చెందిన ఈశ్వర్‌తేజ, కిషోర్‌ కుమార్‌, సోమశేఖర్‌ పాల్గొన్నారు. ఈ నెల 7 నుంచి 10 వరకు మార్టేరులో జరిగిన సీనియర్‌ ఉమెన్‌, మెన్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా ఉమెన్‌ జట్టు ద్వితీయస్థానం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆట ఆరంభం అదిరింది 1
1/2

ఆట ఆరంభం అదిరింది

ఆట ఆరంభం అదిరింది 2
2/2

ఆట ఆరంభం అదిరింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement