సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఆగిరిపల్లి: కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, టెక్నికల్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. గ్రామాల్లోని పరిస్థితులపై నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై శుభ శేఖర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన అభయ మహిళా రక్షక దళాలను పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్ వద్ద గస్తీ తిరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాలనీలలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. కోడిపందేలు, పేకాట, సారా తయారీ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని నెలల క్రితం శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ అయినా పంచలోహ విగ్రహం కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విలేకరులకు చెప్పారు. ఆయన వెంట నూజివీడు డీఎస్పీ కేఎన్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment