ఎవరిరోడ్డువారేబాగుచేసుకోవాలి!
ఏలూరు రూరల్: కూటమి ప్రభుత్వ పాలన.. ప్రజల సమస్యలను వారే తీర్చుకోవాలి అన్నట్టు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా రోడ్ల అభివృద్ధి పనులు నేటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. డిసెంబర్‌లో పనులు ప్రారంభిస్తాం అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇక చేసేది లేక నివాసితులు డబ్బులు పోగు చేసుకుని ఇళ్ల ముందు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. స్థానిక 18వ డివిజన్ పరిధిలో జర్నలిస్ట్ కాలనీ నుంచి పోలీసుకాలనీ వెళ్లే దారి అధ్వాన్నంగా మారింది. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణం. ద్విచక్ర వాహనచోదకులు, ఆటోలు, స్కూల్ వ్యాన్లలో పిల్లలు, వృద్ధులు పయనించేందుకు నానా అవస్థలు పడ్డారు. రోడ్డు బాగు చేయాలంటూ పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. కొద్దిరోజుల క్రితం అధికారులు పోలీసుకాలనీ వద్ద రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో స్థానికులు సంబరపడ్డారు. చాలా కాలానికి రోడ్డు అభివృద్ధి జరుగుతోందనుకున్నారు. తీరా చూస్తే అధికారులు పోలీస్‌కాలనీ పరిసరాల్లో సుమారు 100 మీటర్ల మేరకు రోడ్డు మాత్రమే అభివృద్ధి చేసి, మిగిలిన రోడ్డును వదిలేశారు. దీంతో ఎగువ ప్రాంతంలో నివాసితులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత్యంతరం లేక స్థానికులు కొందరు డబ్బులు వేసుకుని జ్యూట్‌మిల్లు నుంచి వేస్ట్ మెటీరియల్, మట్టి టిప్పర్ల ద్వారా తరలించి రోడ్డును చదును చేయిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు.
రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టని కూటమి ప్రభుత్వం
గత్యంతరం లేక మరమ్మతులకు పూనుకున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment