అల్లూరి స్మృతివనంను మరింత అభివృద్ధి పరచాలి
భీమవరం(ప్రకాశం చౌక్): అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి పరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అజాదికా అమృత్ మహోత్సవం సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి అన్నారు. భీమవరంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లూరి స్మృతి వనం అభివృద్ధి పనులను గురువారం ఆమె కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమా నండూరి మాట్లాడుతూ స్ఫూర్తి వనంలో పచ్చదనంతో పాటు, అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్ర, శనివారాల్లో విజయనగరం జిల్లా పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు తల్లిదండ్రుల ఇంటి పునరుద్ధరణ, చింతపల్లిలో అల్లూరి సీతారామరాజు జైలులో ఉన్న పోలీస్ స్టేషన్ పునరుద్ధరణ పనులను తనిఖీ చేయనున్నట్లు ఆమె చెప్పారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి స్మృతి వనం ప్రాంతాన్ని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంలో ఆనందగ్రూపు చైర్మన్ విశ్వనాథరాజు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు, గాదిరాజు సుబ్బరాజు, సీహెచ్ కృష్ణంరాజు, నాని రాజు, డాక్టర్ రఘురామరాజు, సీహెచ్ ఝాన్సీలక్ష్మి, భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, తదితరులు ఉన్నారు.
‘ఆజాదికా అమృత్’ సెక్రటేరియట్
జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి
Comments
Please login to add a commentAdd a comment