శ్రీవారి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా త్రినాథరావు
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా వేండ్ర త్రినాథరావును నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రినాథరావు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింహాచలంకు బదిలీ అయ్యారు. అలాగే తిరుమల తిరుపతి దేవ స్థానం నుంచి ఎన్వీ సత్యన్నారాయణమూర్తి ద్వారకాతిరుమల దేవస్థానానికి ఈఓగా బదిలీపై వచ్చారు. అయితే సత్యన్నారాయణమూర్తి గుండె సంబంధిత చికిత్స నిమిత్తం నెలరోజుల పాటు సెలవు పెట్టడంతో, శ్రీవారి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా త్రినాధరావు నియమితులయ్యారు. ఆయన శుక్రవారం చార్జ్ తీసుకోనున్నారు.
సీపీఐ నూతన కార్యాలయం కూల్చివేత
బుట్టాయగూడెం: స్థానిక గంగానమ్మ గుడి సమీపంలో సీపీఐ నిర్మించిన నూతన కార్యాలయాన్ని గురువారం సాయంత్రం పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఈ కూల్చివేతను ఆ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రెవెన్యూ భూమిలో అక్రమంగా నిర్మించిన కారణంగానే ఈ భవనాన్ని కూల్చివేసినట్లు తహసీల్దార్ పీవి చలపతిరావు తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయ భవన నిర్మాణ సమయంలో ఆ పార్టీ నాయకులు చోడెం దుర్గ, బేతి కిశోర్‌లపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. కాగా కార్యాలయాన్ని శనివారం ప్రారంభించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకోగా ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకొంది.
సౌత్‌జోన్ చెస్ టోర్నీకి విద్యార్థి ఎంపిక
పెదవేగి : దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంత కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏ రత్నాకర్ సౌత్‌జోన్ పురుషుల చెస్ టోర్నమెంట్‌కు ఎంపికై నట్లు ఆ కళాశాల కరస్పాండెంట్, సెక్రెటరీ ఫాదర్ మోజెస్ తెలిపారు. జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం వెల్‌టెక్ డాక్టర్ రంగరాజన్, డాక్టర్ సగుంతల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఈ టోర్నమెంట్‌లో జరుగుతుందన్నారు. ఈనెల 23న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆశ్రమం మెడికల్ కళాశాల్లో జరిగిన పోటీల్లో రత్నాకర్ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థి రత్నాకర్‌ను, పీడీ నల్లయ్యను కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్, వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ అభినందించారు
Comments
Please login to add a commentAdd a comment