జిల్లా కేంద్రం తరలింపు? | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రం తరలింపు?

Published Wed, Jan 1 2025 2:05 AM | Last Updated on Wed, Jan 1 2025 2:05 AM

జిల్లా కేంద్రం తరలింపు?

జిల్లా కేంద్రం తరలింపు?

సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం జిల్లా కేంద్రం తరలింపు వ్యవహారం రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తుంది. గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే సాకుతో ఏకంగా భీమవరం నుంచి జిల్లా కేంద్రాన్ని ఉండికి తరలించేందుకు కూటమి నేతలు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే స్థల కేటాయింపు, రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగాక.. కేవలం రాజకీయ కారణాలతో తరలింపునకు కూటమి నేతలు ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులు క్రితం భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జిల్లా కేంద్రాన్ని తరలిస్తున్నామని, దీని కోసం 60 ఎకరాల భూసేకరణ చేస్తామని ప్రకటించారు. రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యక్తిగత ఎజెండాతోనే ఇలా చేస్తున్నారంటూ తీవ్ర దుమారం రేగింది. భీమవరంలోనే జిల్లా కేంద్రం ఉంటుందని, అవసరమైతే భీమవరంలోనే వేరే ప్రాంతానికి మారుస్తామంటూ మళ్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం తరలింపుపై గత 20 రోజులుగా తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గత వారం జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి ఉండి నియోజకవర్గంలో ఇరిగేషన్‌ శాఖకు చెందిన మూడున్నర ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. కలెక్టరేట్‌కు, మిగలిన శాఖల భవన నిర్మాణాలకు స్థలం సరిపోతుందా? లేదా? అనే అంశాలు పరిశీలించారు. భీమవరం నుంచి ఉండి నియోజకవర్గానికి జిల్లా కేంద్రం మారుతుందనే వాదన బలంగా వ్యక్తం కావడంతో సోషల్‌ మీడియాలో రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. వైఎస్సార్‌సీపీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించింది.

రెండేళ్ల క్రితం ఏర్పాటు

పరిపాలనా సౌలభ్యం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. కొత్త పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. జిల్లాకు మధ్యలో ఉండటం, అందరికి అందుబాటులో ఉండటంతో భీమవరాన్ని ఎంపిక చేశారు. అద్దె భవనంలో 2022 ఏప్రిల్‌ 4న కలెక్టరేట్‌ను ప్రారంభించారు. శాశ్వత ప్రాతిపదికన జిల్లా కేంద్రం ఉండాలనే యోచనతో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ప్రతిపాదన ఖరారు చేశారు. దీనిలో భాగంగా 20 ఎకరాల్ని భీమవరంలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ యార్డు స్థలాన్ని అప్పటి కలెక్టర్‌ ప్రశాంతి ఎంపిక చేశారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి మార్కెటింగ్‌ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు భూమి బదలాయించేలా జీవో జారీ చేయడంతో పాటు రెవెన్యూ రికార్డులను, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా మార్పు చేశారు. జీవో నెంబర్‌. 124 పేరుతో గత ప్రభుత్వం 2023 మార్చి 20న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపి ఖరారు చేసి రూ.80 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తే పరిపాలనా సౌలభ్యం ఉంటుందని నిర్ణయించారు.

కుట్ర రాజకీయాలు

భవన నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ ఇలా అన్ని పూర్తయితే గత సర్కారు పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనే రాజకీయ కక్షతో జిల్లా కేంద్రం మార్పునకు పావులు కదిపారు. దీనికి అనుగుణంగా స్థలాల్ని వెదుకుతున్నారు. ఉండిలో స్ధలాలు రెడీగా ఉన్నాయని జిల్లా కేంద్రం తరలిపోతుందని పొలిటికల్‌ సర్కిళ్లలో ప్రచారం సాగుతుంది.

ఎక్కడైనా చూస్తాం: కలెక్టర్‌

జిల్లా కేంద్రం మార్పుపై విలేకరులు కలెక్టర్‌ను ప్రశ్నించగా.. జీవో రద్దు గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రభుత్వ భవనాల అవసరాల కోసం స్థలాలు ఎక్కడైనా చూస్తామని చెప్పారు.

భీమవరం నుంచి మార్పునకు ప్రయత్నాలు

మార్కెట్‌ యార్డులో 20 ఎకరాలు కేటాయించిన గత సర్కారు

రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌కు టెండర్లు పూర్తి

గత ప్రభుత్వానికి పేరు వస్తుందని కుట్ర రాజకీయాలు

ఉండి మండలం పెదఅమిరంలో స్థలాలు పరిశీలించిన జేసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement