ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించడం, ప్రమాదరహిత ప్రయాణాన్ని ప్రజలకు అందించడంలో ఆర్టీసీ బస్సులు సురక్షితమని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ అన్నారు. స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో గురువారం రహదారి భద్రతా శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆర్టీసీకి సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నారని, ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేయడంలో వారు నేర్పరులు అన్నారు. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ డ్రైవర్లకు సూచనలు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లపై గురుతర బాధ్యత ఉందన్నారు. రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించే దిశగా రవాణా శాఖ కార్యాచరణ అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌వీఆర్ వరప్రసాద్, ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి, జిల్లాలోని వివిధ డిపోల డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment