కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ | - | Sakshi
Sakshi News home page

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ

Published Tue, Feb 11 2025 1:40 AM | Last Updated on Tue, Feb 11 2025 1:40 AM

కొత్త

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ

సాక్షి, భీమవరం: కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామన్నారు. ఎన్నికల సభల్లో ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కూటమి పాలన చేపట్టి ఎనిమిది నెలలు గడిచిపోగా కొత్త పింఛన్ల మంజూరు ఊసే లేకపోగా.. పింఛన్ల వెరిఫికేషన్‌ పేరిట ఉన్న వాటికి కొర్రి పెట్టే పనిలో ఉన్నారు.

ఆశలపై నీళ్లు

జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుమారు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. కూటమి అధికారంలోకి రావడంతో 50 ఏళ్లకే పింఛన్‌ హామీ అమలుకోసం ఆయా వర్గాల వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్‌డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన అర్హులైన వారు ప్రదక్షిణలు చేస్తుండగా తమకింకా మార్గదర్శకాలు ఏమీ రాలేదంటూ అధికారులు వారిని తిప్పి పంపుతున్నారు.

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల వెల్లువ

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసేవారు. గతేడాది జనవరిలో వచ్చిన దరఖాస్తుల మేరకు జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. మరలా జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి కొత్త పింఛన్ల కోసం 6,350 దరఖాస్తులు ఆన్‌లైన్‌ అయ్యాయి. ఈ ప్రభుత్వంలోనూ కొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 15 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. సైట్‌ ఓపెన్‌ కాక దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే వీలులేకపోవడంతో వ్యయ ప్రయాసల కోర్చి పేదలు అందజేస్తున్న ఆర్జీలు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి. తమకు అర్హత ఉన్నా పింఛన్‌ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాలు ఆవేదన చెందుతున్నాయి.

ఉన్న వాటినీ పీకేస్తూ..

గత జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర సామాజిక పింఛన్‌ లబ్ధిదారులు 2,34,161 మంది ఉన్నారు. ప్రస్తుత ఫిబ్రవరి నాటికి జిల్లాలోని లబ్ధిదారుల సంఖ్య 2,27,086కు చేరింది. గత ఎనిమిది నెలల కాలంలో వివిధ కారణాలతో 7,075 మంది పింఛన్లను తొలగించారు. అధిక శాతం మరణాల వలనే లబ్ధిదారులు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు అందించే సాయం తగ్గుతోంది. గత ఆగస్టులో జిల్లాలోని లబ్ధిదారులకు రూ.97.25 కోట్లు పింఛన్‌ సాయం అందించగా ఈనెల రూ.96.72 కోట్లు సాయం అందించారు. ఇదిలా ఉండగా కొత్త పింఛన్లు మంజూరు లేకపోగా వెరిఫికేషన్‌ అంటూ ఉన్న వాటికి కొర్రి పెట్టే పనిలో పడింది ప్రభుత్వం. జిల్లాలో దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులు 27,528 మంది ఉండగా ప్రస్తుతం ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పేరిట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

పెండింగ్‌లో 20 వేలకుపైగా పింఛను దరఖాస్తులు

పాత పింఛన్ల వెరిఫికేషన్‌ పేరుతో కూటమి కాలయాపన

అమలుకు నోచుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ హామీ

కూటమి పాలనలో 7,075 పింఛన్ల తొలగింపు

పింఛన్‌ రావడం లేదు

నా భర్త పింఛన్‌ తీసుకుంటూ గతేడాది ఆగస్టులో మరణించారు. గతంలో పింఛన్‌ తీసుకుంటూ భర్త చనిపోతే మరు సటి నెల నుంచే భార్యకు పింఛన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయంలో అడుగుతుంటే సైట్‌ ఓపెన్‌ కావడం లేదంటున్నారు.

–సి.భాగ్యవతి, పాలకోడేరు

కాలయాపనతో సరి

పేదవర్గాలకి ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛనే జీవనాధారం. కూటమి ప్రభుత్వం వ చ్చి ఎనిమిది నెలలు గడుస్తు న్నా ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయలేదు. ప్రభుత్వం కాలయాపన మాని కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలి.

– పొట్ల సురేష్‌, న్యాయవాది, తణుకు

హామీని అమలుచేయాలి

50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పా రు. దీనిపై అధికారులను అడుగుతుంటే ప్రభుత్వం నుంచి ఇంకా విధివిధానాలు ఏమీ రాలేదని చెబుతున్నారు. ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం అమలుచేయాలి.

– దేవ రాజేష్‌, పోడూరు

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ1
1/3

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ2
2/3

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ3
3/3

కొత్తవి లేవు.. ఉన్నవాటికీ కొర్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement