రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం...రైతు వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తోంది. విత్తనం వేసింది మొదలు...పంట విక్రయించే దాకా అన్ని విషయాల్లో అండగా ఉంటోంది. పంట పండితే గిట్టుబాటుధర...పంట నష్టపోతే పరిహారం ఇస్తోంది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది.
పుట్టపర్తి అర్బన్: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తరచూ చెప్పే సీఎం జగన్ అన్నింటా రైతన్నకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి పథకాన్నీ వర్తింపజేస్తూ అన్నదాత ఇంట సంతోషాలు నింపుతున్నారు. జిల్లాలోని రైతుల ఖాతాల్లో ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జగన్ సర్కార్ ఏకంగా రూ.892 కోట్లు జమ జేసింది. దీంతో పాటు బ్యాంకుల ద్వారా మరో రూ.2,559 కోట్లు రుణాలు అందించింది. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, పశు సంవర్ధక, మత్స్య శాఖలతో పాటు ఏపీఎంఐపీ సహకారంతో ఎన్నో పథకాలను రైతులకు అందిస్తున్నారు.
ముంగిళ్లలో సేవలు..
ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సేవలన్నీ ముంగిళ్లలోనే అందిస్తోంది. రైతుకు నాణ్యమైన సబ్సిడీ విత్తనం, కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు, సాగులో మెలకువలతో పాటు పంట పండితే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరతో సేకరిస్తోంది. ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం జరిగితే పరిహారం ఇస్తోంది. అలాగే మట్టి పరీక్షలు, యంత్రసేవ ద్వారా రైతులకు అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలు, పాడి రైతుల కోసం సంచార పశువైద్య శాలలు, పశువులు చనిపోతే పశు నష్ట పరిహారం, ఉద్యాన రైతులకు స్పింక్లర్‌లు, డ్రిప్, కోల్డ్ స్టోరేజీలు, పట్టు పురుగుల పెంపకం కేంద్రాలు, నేత్రికలు, ఫారంపాండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.
ఉద్యాన రైతుకూ ఊతం
ఉద్యాన శాఖ ద్వారా సమగ్ర ఉద్యాన పథకం, పండ్ల తోటల నిర్వహణ, నీటి వనరుల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సేకరణ యంత్రాలు, కోల్డ్ స్టోరేజీలు, హైబ్రిడ్ కూరగాయల ఉత్పత్తి కింద సుమారు 12,505 మంది రైతులకు రూ.6.06 కోట్లు అందజేశారు. దీంతో పాటు పండ్ల తోటల పెంపకానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఎంఐపీ ద్వారా ఈ ఏడాది రెండు విడతల్లో డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. 90 శాతం సబ్సిడీతో 19,198 మంది రైతులకు చెందిన 25,402 హెక్టార్లలో సూక్ష్మ పరికరాలను బిగించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.58.29 కోట్లు వ్యయం చేసింది.
‘పట్టు’ రైతుకు ప్రోత్సాహం
పట్టు రైతులకూ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోంది. మల్బరీ మొక్కలు నాటడం, పట్టు పురుగుల పెంపకం గదుల నిర్మాణం, కూలింగ్ పరికరాలు, సోలార్ సిస్టం, చాకింగ్ గదులు, ఫారం మెకనైజేషన కింద సిల్క్ సమగ్ర పథకం తదితర వాటి కింద 2,899 మంది రైతులకు రూ.10.98 కోట్లు వ్యయం చేసింది.
పాడిరైతుకూ సాయం
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు నష్ట పరిహారం కింద ఈ ఏడాది రూ.2.50 కోట్లు పాడి రైతులకు అందజేసింది. దీంతో పాటు ఒక్కో వాకింగ్ ప్రిజ్ కోసం రూ.16 లక్షలతో 8 ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసింది. ఉచితంగా లక్షల విలువైన గాలికుంటు వ్యాధి నివారణ మందులు అందజేస్తోంది.
అన్నదాతకు తోడుగా..
జిల్లాలో 3,65,875 మంది రైతులుండగా, సాధారణ సాగు విస్తీర్ణం 3,23,763 హెక్టార్లు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి విత్తన పంపిణీ చేపడతున్నారు. వేరుశనగతో పాటు కంది, పెసర, కొర్ర, సామలు, జీలుగ, రాగితో పాటు చిరుధాన్యాలను సైతం అందజేస్తున్నారు. గత ఏడాదిలో రెండు సార్లు రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, కోత మిషన్లు సబ్సిడీపై అందజేశారు. ఇందుకు గాను రూ.10.78 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున ఏడాదిలో రూ.371.69 కోట్లు అందజేశారు. ఖరీఫ్‌లో విత్తన సబ్సిడీ కింద రూ.18 కోట్లు, 2022లో ఉచిత పంటల బీమా కింద 1.72 లక్షల మందికి రూ.255.78 కోట్లు అందజేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.31 లక్షలు, 416 సీహెచ్‌సీ గ్రూపులకు 1,165 యంత్ర పరికరాలు అందజేశారు. ప్రస్తుతం వాతావరణ బీమా కింద జిల్లా రైతులకు రూ.157.598 కోట్లు అందజేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీ కళ్యాణదుర్గం విచ్చేస్తున్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వం
రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. రైతులను వెన్నంటి ఉండే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. నాకు రైతు భరోసా, పంటల బీమా, విత్తన సబ్సిడీ, యంత్రసేవ ద్వారా లబ్ధి కలిగింది. సీఎం వైఎస్ జగన్ రుణం ఎన్నటికీ తీర్చు కోలేనిది. ఎన్నటికీ ఆయన వెన్నంటే ఉంటా.
– భాస్కర్‌రెడ్డి, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి
రూ.1.50 లక్షలకే కోరిన ట్రాక్టర్
యంత్ర సేవ పథకంలో భాగంగా రూ.15 లక్షల విలువైన ట్రాక్టర్‌ను నేను రూ.1.50 లక్షలకే పొందగలిగాను. నా పొలాన్ని దున్నుకోవడంతో పాటు తోటి రైతులకు తక్కువ బాడుగకే ట్రాక్టర్‌తో పనులు చేస్తున్నా. అలాగే వివిధ పథకాలతో నా కుటుంబానికి మరో రూ.3.5 లక్షల లబ్ధి కలిగింది. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పథకాన్ని చూడలేదు.
– శ్రీరాములు, ఓబుళరెడ్డిపల్లి, తలుపుల మండలం
Comments
Please login to add a commentAdd a comment