సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
కొందరే పోలీస్‌స్టేషన్లకు..
ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్‌లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు.
వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం.
నా ఫోన్ దొరికింది
మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్‌లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది.
– షేక్ బాషా, భీమవరం
సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా..
సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
– యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment