నఫ్టాలి బెన్నెట్
ఒకవైపు తీవ్రమైన హింసాత్మక ఘర్షణలు, మరోవైపున కాల్పుల విరమణ నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నఫ్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదన సఫలం కావడానికి ఎన్నో చిక్కుముళ్లు అడ్డుపడుతున్నాయి. ఒకరి ఉనికిని మరొకరు గుర్తించడానికి ఇష్టపడని వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాంగానికి చాలా కష్టమైన పనే. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంది.
దాదాపు 11 రోజుల హింసాత్మక ఘర్షణల తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ మధ్య కాల్పుల విరమణ జరిగిన నెలరోజుల లోపు ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా నప్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాల్పుల విరమణ కోసం చర్చలకు ప్రోత్సహించిన అమెరికా దాని మిత్రదేశాలు ‘రెండు దేశాల పరిష్కారం’ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాయి. పర్యవసానంగా ఈ అంశంపై ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్ నేతలతో మరింతగా చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తరపున విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ని పంపించారు. ఈ అంశంపై ఇజ్రాయెల్ నూతన ప్రధాని బెన్నెట్ కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, ప్రతిపాదించిన పరిష్కారం వైపు ముందుకు నడవడం బైడెన్ యంత్రాంగానికి ఏమంత సులువైన పని కాదు. ఈ విషయంలో అనేక సంక్లిష్టతలు ఏర్పడి ఉన్నాయి.
ఒకటి, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల ఏర్పాటు కోసం 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్లాన్ తీర్మానం 181 (ఐఐ) ప్రకారం, రెండు దేశాలమధ్య పరస్పరం విభజించుకున్న భూఖండాలను కలిగి ఉన్నాయి. అంటే ఇలా తమతమ భూఖండాలను దాటడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని దీని అర్థం. ఈ రెండు దేశాలు ఎంత మంచి సంబంధాలు కలిగి ఉంటున్నాయన్నదాన్ని బట్టి ఇలాంటి ఏర్పాట్లు విజయవంతమవుతుంటాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించకపోతే మళ్లీ ఘర్షణ ఏర్పడుతుందన్నది స్పష్టమవుతుంది.
రెండు, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ), ఇజ్రాయెల్ మధ్య 1993లో కుదిరిన ఓస్లో ఒడంబడిక ఈ రెండు దేశాల ఉనికిని లాంఛనప్రాయంగా గుర్తించింది, పాలస్తీనా అథారిటీ స్థాపనకు మార్గం కల్పించింది. జెరూసలేం పాలనాధికార సంస్థకు సంబంధిం చిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలూ జెరూసలేంని తమ రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఆ నగరంతో ప్రత్యేకించి అక్కడి పవిత్ర స్థలాలపై చారిత్రక అనుబంధం తమకే ఉందని చెప్పుకున్నాయి. జెరూసలేంని తన నియంత్రణలో ఉంచాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం 181 ప్రతిపాదించినప్పటికీ పాలస్తీనా, ఇజ్రాయెల్ నేతలు ఇద్దరూ తిరస్కరించారు. 1949లో నాటి ఇజ్రాయెల్ ప్రధాని బెన్ గురియన్ మరికాస్త ముందుకెళ్లి పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్‌లో అంతర్భాగం అని ప్రకటించేశారు. జెరూసలేంని రెండు దేశాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాలని అంతర్జాతీయ సమాజం ప్రతిపాదించినప్పటికీ ఇజ్రాయెల్ దానికి అంగీకరించలేదు. మూడు, దాదాపు 45 కిలోమీటర్ల వరకు భౌతికంగా వేరుపడి ఉన్న గాజా, వెస్ట్ బ్యాంక్ వంటి పాలస్తీనా భూభాగాలు కూడా రెండు ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల నియంత్రణలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ మితవాద రాజకీయ పార్టీ ఫతాహ్ అదుపులో ఉంది. రాడికల్ ఉగ్రవాద సంస్థ హమాస్ గాజాను అదుపులో పెట్టుకుని ఉంది. పాలస్తీనా అథారిటీకి నేతృత్వం వహిస్తున్న మితవాద పార్టీలు ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిస్తుండగా, హమాస్ దాన్ని వ్యతిరేకించి ఇజ్రాయెల్‌తోపాటు ఇంతవరకు ఉన్న భూభాగాలన్నీ గ్రేటర్ పాలస్తీనాలో భాగమని ప్రకటిస్తూ ఆ లక్ష్య సాధనకోసం పోరాడుతోంది.
హమాస్ 1988 చార్టర్ ఇజ్రాయెల్‌తో సహా మొత్తం పాలస్తీనాను వక్ఫ్ లాండ్ (తరతరాల ముస్లింలకు ధర్మనిధి) ప్రకటించింది. కాబట్టి దాని విభజనను హమాస్ ఒప్పుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న శాంతి, రాజీ ప్రయత్నాలు హమాస్ కఠిన వైఖరి కారణంగా పలుచబడిపోయాయి. ఇప్పుడు రెండు దేశాల పరిష్కారాన్ని ఆమోదించవలసి వచ్చినప్పుడు హమాస్ నిజమైన ఉద్దేశాలు ఏమై ఉంటాయనేది ఇప్పటికైతే తెలీటం లేదు.
నాలుగు, మరో సంక్లిష్టమైన సమస్య ఏమిటంటే వలసలు, శరణార్థులకు సంబంధించినది. వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలలో ఇజ్రాయెల్ నిర్మించిన ఆవాస ప్రాంతాల్లో 5 లక్షలమంది కంటే ఎక్కువమంది యూదులు నివసిస్తున్నారు. అదే సమయంలో 50 లక్షలమంది పాలస్తీనీయులు తమ మాతృభూమికి దూరమై ఇరుగుపొరుగు దేశాల్లోని ఐక్యరాజ్యసమితి శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీరిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించడం, లేదా వారికి కొత్త ప్రదేశాల్లో ఆశ్రయం చూపించడం ద్వారా హేతుపూర్వకమైన పరిష్కారం కనుగొనడం చాలా కష్టమైన పని. పైగా ఈ క్రమంలో భారీ స్థాయి హింస ప్రజ్వరిల్లే అవకాశం కూడా ఉంది.
అరబ్ సంఘీభావం.. అతిపెద్ద అభాస
క్షేత్రస్థాయిలో ఈ సంక్లిష్టతలు ఉన్న నేపథ్యంలో రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రత్యేకించి హమాస్ ఆమోదించేలా ఒప్పించడం అతి పెద్ద సవాలు అవుతుంది. 1967 నాటి సరిహద్దుల ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పర్చడాన్ని హమాస్ 2017 డాక్యుమెంట్ ఆమోదిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిం చకుండా, జెరూసలేం రాజధానిగా, అందరు శరణార్థులను తమ తమ స్వస్థలాలకు అంటే ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చే నిబంధన కింద పాలస్తీనా వాసులందరినీ విముక్తి చేయడం అనే తన చిరకాల లక్ష్యాన్ని హమాస్ ప్రకటించడం గమనార్హం. మరోవైపున ఇజ్రాయెల్ ప్రధానిగా నూతనంగా ఎంపికైన నఫ్టాలి బెన్నెట్ ఈ రెండు దేశాల పరి ష్కారం అనే భావాన్నే తిరస్కరిస్తున్నారు. ఇరుపక్షాలు అవలంబిస్తున్న ఈ తరహా వైఖరి మరింత ప్రతిష్టంభననే తీసుకొస్తుంది.
రెండు దేశాల పరిష్కారాన్ని ముందుకు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడానికి జరిగే ఏ ప్రయత్నానికైనా విస్తృతస్థాయి ప్రాతినిధ్యం, సంప్రదింపులు అవసరం అవుతాయి. అంతర్జాతీయ సమాజం ఈ భావాన్ని బలపరుస్తున్నప్పటికీ, దీనికి కీలకమైన మద్దతు పొరుగునే ఉన్న అరబ్ కమ్యూనిటీ నుంచి రావాల్సి ఉంది. ఇది ఇప్పుడు రాజకీయంగా, మతపరంగా వేరుపడి ఉంది. ఇరాన్, టర్కీ నుంచి గణనీయంగా హమాస్ మద్దతు పొందుతోంది. హమాస్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సౌదీ అరేబియా నాయకత్వాన్ని ఇరాన్, టర్కీలు సవాలు చేస్తున్నాయి. హమాస్‌కి ఇప్పటికీ బలమైన ఆర్థిక, సైనిక మద్దతు ఇరాన్ నుంచి వస్తోంది. దీంతో హమాస్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు లేని అమెరికా దానితో చర్చించడానికి ప్రధానంగా జోర్డాన్, ఈజిప్టు దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ సంక్లిష్ట వైరుధ్యాల గుండా ముందుకెళ్లి సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాం గానికి చాలా కష్టమైన పనే. పరిష్కారం కుదరకపోతే.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. 2008, 2012, 2014 సంవత్సరాల్లో కుదిరిన కాల్పుల విరమణలు తాత్కాలిక శాంతిని మాత్రమే కొనితెచ్చినట్లుగా ఈ ప్రాంతం మళ్లీ విస్తృత స్థాయి హింసాత్కక ఘర్షణలకు తావిస్తుందని భావించాల్సి ఉంటుంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంది. తలపడుతున్న రెండు వర్గాలకు మద్దతు ప్రకటిస్తూనే జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇజ్రాయెల్ పూర్వ ప్రధాని నెతన్యాహూతో సమానస్థాయి సంబంధాలను ప్రధాని మోదీ కలిగి ఉండనప్పటికీ, కొత్త ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఇజ్రాయెల్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్మరించకూడదు. అదేసమయంలో పాలస్తీనీయుల పట్ల భారత్ సానుభూతిని కూడా తోసిపుచ్చలేం. ఎందుకంటే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మద్దతును పాలస్తీనా ఉద్వేగభరితమైన మద్దతును పొందుతోంది మరి.
డా. గద్దే ఓంప్రసాద్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం, మొబైల్:79089 33741
Comments
Please login to add a commentAdd a comment