ఉత్తుత్తి ఉద్యోగోన్నతులు !
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియను అపహాస్యం చేస్తోంది. మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి వారిని గతంలో పనిచేసిన పాఠశాలలోనే పనిచేయాలని ఆదేశిస్తోంది. దీంతో గ్రేడ్–2 హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రోజు హెచ్‌ఎంలే!
గుంటూరు నగరపాలకసంస్థతో పాటు జిల్లాలోని మున్సిపాల్టీల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఈనెల 8న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా ఉన్నతాధికారులు ఉద్యోగోన్నతి కల్పించారు. వీరిలో గుంటూరు, నరసరావుపేట, పొన్నూరుల్లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు, తెనాలిలో నలుగురు ఉన్నారు. సోమవారం వీరంతా కొత్త పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదే రోజు సాయంత్రం విధుల నుంచి రిలీవయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన పాఠశాలలకు తిరిగి వెళ్లి స్కూల్ అసిస్టెంట్లుగా బోధన ప్రారంభించారు. ఈ ఉద్యోగోన్నతుల వల్ల లాభమేంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
విద్యాసంవత్సరం మధ్యలో ప్రమోషన్ల వల్లే దుస్థితి!
విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టడం వల్ల సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా వెళ్తే పాఠశాలల్లో బోధనకు ఆటంకం కలుగుతోందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు తిరిగి పాత పోస్టులకే వెళ్లి బోధించాలని ఆదేశించారు. విద్యాసంవత్సరం ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గ్రేడ్–2 హెచ్‌ఎం ఉద్యోగోన్నతులతో ఖాళీగా మారిన స్థానాలను ఎస్జీటీలకు ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేసేందుకు మంగళవారం గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో డీఈఓ రేణుక ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 మంది ప్రమోషన్లు పొందారు. వీరు కూడా విద్యాసంవత్సరం ముగిసే వరకు పాత పోస్టుల్లోనే పనిచేయాలి.
ఇన్‌చార్జి హెచ్‌ఎంల విముఖత
గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేయడంతో హైస్కూళ్లలో ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ హెచ్‌ఎంలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తీరా ప్రమోషన్‌పై వచ్చిన వారు మళ్లీ పాత పాఠశాలలకే వెళ్లడంతో తిరిగి ఇన్‌చార్జులుగా బాధ్యతలు చేపట్టేందుకు వారు విముఖత చూపుతున్నారు.
టీచర్ల ప్రమోషన్లలో ట్విస్ట్ పేరుకే పదోన్నతి.. పాత పోస్టులోనే పని గుంటూరు జిల్లాలో ఏడుగురికి హెచ్‌ఎంలుగా పోస్టింగ్ కొత్త విధుల్లో చేరిన రోజే రిలీవైమళ్లీ స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లినవిచిత్ర పరిస్థితి ప్రభుత్వ అస్తవ్యస్త విధానానికి నిదర్శనం
ఉద్యోగోన్నతులకు అర్థం లేదు
మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏళ్ల తరబడి ఉద్యోగోన్నతులు లేవు. ఉద్యోగోన్నతులు కల్పించిన ప్రభుత్వం తిరిగి వారిని పాత పాఠశాలల్లో పాత స్థానాల్లోనే పని చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరం. హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండటంతో హైస్కూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసినట్టే చేసి ఉపాధ్యాయులకు ఉపయోగం లేకుండా చేశారు.
– బి.హైమారావు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment