ఉచిత ఇసుకంటూనే కేసులేంటీ?
గోరంట్ల నగరాలులో ట్రాక్టర్ల డ్రైవర్ల నిరసన
గుంటూరు రూరల్: ప్రభుత్వం ట్రాక్టర్లు, ఎడ్లబళ్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని చెబుతుంటే అధికారులు ఆపి కేసులు రాస్తున్నారని, బిల్లులు చూపాలని వేధిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు గోరంట్లలోని నగరాలు వద్ద అడ్డుకున్నారు. బిల్లులు, పత్రాలు చూపించాలని ప్రశ్నించారు. దీంతో అమరావతిరోడ్డు నగరాలు నుంచి గోరంట్ల వరకూ రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు పెట్టి ఓనర్లు, డ్రైవర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతున్నా.. రీచ్‌లలో ఇసుక లోడింగ్, ఇతర ఖర్చులు అంటూ వేల రూపాయలు తీసుకుంటున్నారని, బిల్లులు ఏమీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా సమయంలోనూ అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని, రూ.వేలల్లో జరిమానాలు విధిస్తున్నారని ఉచిత ఇసుక బూటమేనా అంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయిచారు. ట్రాఫిక్ సుమారు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు ఈసారికి వదిలేస్తున్నామని, ఇక నుంచి బిల్లులు లేకుంటే ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
నాలుగు రోజుల్లోనే భారీ చోరీ కేసు ఛేదన
● చిన్న సాంకేతిక ఆధారంతో దొంగలను పట్టుకున్న పోలీసులు
● నిందితులిద్దరూ మహిళలే
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్దనరావు
తెనాలిరూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. ఘటనా స్థలంలో లభించిన చిన్న సాంకేతిక ఆధారంతో నిందితులను చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెనాలి వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో సీఐ మల్లికార్జునరావుతో కలిసి డీఎస్పీ జనార్దనరావు ఈ కేసు వివరాలను విలేకరులకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక రామలింగేశ్వరపేట తోటావారివీధికి చెందిన పురోహితుడు విష్ణుభట్ల మల్లికార్జున శర్మ కుటుంబం గతనెల 31న ఇంటికి తాళం వేసి తణుకు వెళ్లింది. ఈనెల 7న ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన తెనాలి వచ్చిన మల్లికార్జునశర్మ తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ మొత్తంలో చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. దర్యాప్తు చేపట్టిన సీఐ మల్లికార్జునరావు చిన్న సాంకేతిక ఆధారంతో వేమూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును పరిశీలించి చోరీకి పాల్పడింది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించే శీలం రోశమ్మ, శీలం మహంకాళమ్మగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన 80 గ్రాముల రెండు బంగారు గొలుసులు, నాలుగున్నర కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా నిందితులను గుర్తించిన సీఐ మల్లికార్జునరావును డీఎస్పీ అభినందించారు.
రేపటి నుంచి పుస్తక మహోత్సవం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈనెల 14 నుంచి డిసెంబర్ 13 వరకు గుంటూరులో పుస్తక మహోత్సవం విశాలాంధ్ర బుక్ హౌస్ గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక విశాలాంధ్ర బుక్ హౌస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని స్థానిక ఏఎల్‌బీఈడీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తామన్నారు. ఈ పుస్తక మహోత్సవంలో 40 రకాల ప్రచురణ సంస్థలు ప్రచురించిన 20 వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రఖ్యాత రచయితల రచనలు, ఆధ్యాత్మిక, వాస్తు శాస్త్ర, గ్రంథాలతోపాటు పాపులర్ సైన్స్ గ్రంథాలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో లభిస్తాయని, అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు కూడా ఉంటాయని వివరించారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మహోత్సవం ఉంటుందని, పుస్తకాలపై 10 శాతం రిబేటు ఇవ్వనున్నట్లు తెలిపారు. పుస్తక మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి సాయంత్రం 6 గంటలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment