మిర్చి రవాణా వివాదాలు పరిష్కరించుకోవాలి
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి బస్తాల రవాణా విషయంలో వివాదాలు లేకుండా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్, మిర్చి యార్డు పర్సన్ ఇన్‌చార్జి ఎ.భార్గవ్ తేజ్ ఆదేశించారు. యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మిర్చి ఎగుమతి, లారీ ఓనర్స్ అసోసియేషన్లతో మంగళవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. జేసీ భార్గవ్ తేజ మాట్లాడుతూ లారీ కిరాయి విషయంలో మిర్చి ఎగుమతి వ్యాపారులు, లారీ ఓనర్ల మధ్య వివాదాలు లేకుండా చూసుకోవాలన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి లోడ్ చేసిన మిర్చి లారీలను, తక్కువ ధరకు పెట్టే లారీలను ఆపడం సరికాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కిరాయి విషయం ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. మిర్చి ఎగుమతి వ్యాపారుల అసోసియేషన్ నాయకులు జుగీరాజ్ భండారీ, కొత్తూరి సుధాకర్, వైఆర్‌కే శ్రీనివాస్‌లు మాట్లాడుతూ లారీల సమస్యతో ఐదేళ్లుగా గుంటూరులో ఉన్న మిర్చి వ్యాపారులు దెబ్బతింటున్నారని పేర్కొన్నారు. పలువురు లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పెరిగిన ట్యాక్స్‌లతో లారీలు నడపడం భారంగా మారిందన్నారు. లారీ కిరాయిని నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు, రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ కె.సీతారామిరెడ్డి, ఆర్టీఓ సత్యనారాయణ ప్రసాద్, డీఎస్పీ మల్లికార్జునరావు, సీఐ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ
Comments
Please login to add a commentAdd a comment