నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి
తెనాలి : అద్వైత పీఠాల్లో అత్యంత ప్రశస్తమైన శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీస్వామి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో విజయవాడలో బస చేశారు. 20, 21వ తేదీల్లో నరసరావుపేట, 22, 23వ తేదీల్లో గుంటూరులో ఉంటారు. చిన్న వయసులోనే శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వామి శ్రీశృంగేరీ పీఠానికి తదుపరి 37వ జగద్గురువులని తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాతో స్వామికి అనుబంధం ఉంది.
తెనాలి సమీపంలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనంతవరం వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి, కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని. వేదాలు, వేదభాష్యంలో ప్రఖ్యాత పండితుడైన శివసుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని టీటీడీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌గా, ఎస్‌వీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ వేదిక్ స్టడీసీ, టీటీడీ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్నారు. వీరి రెండో కుమారుడు వెంకటేశ్వరప్రసాద శర్మ. 1993 జులై 24న తిరుపతిలో జన్మించారు. అయిదేళ్ల వయసులోనే కుమారుడికి ఉపనయనం చేయించారు.
కృష్ణ యజుర్వేదమే తొలి పాఠం...
తాత కృష్ణ యజుర్వేద పాఠాలే తొలి అభ్యాసం. తండ్రి వద్ద కృష్ణ యజుర్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. కుప్పా వంశీకులు హంసల దీవిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక భాగవత సప్తాహాలు జరుపుతుంటారు. వేద విద్యలో కొనసాగుతున్న ప్రసాద శర్మ, ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటూ, తండ్రితో కలిసి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ సందర్శించారు. 2006లో శృంగేరీ శారదా పీఠంలో తాత, తండ్రితో కలిసి ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో శృంగేరీ పీఠం జగద్గురును దర్శించుకున్నపుడు స్వామి శిష్యరికంలో శాస్త్రాలు నేర్చుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.
జగద్గురు బోధనలతో...
ఆ విధంగా శృంగేరీ జగద్గురు అనుగ్రహానికి 22 ఏళ్ల వయసులోనే నోచుకున్నారు. న్యాయ, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలను, అక్కడి ఉద్దండ పండితుల వద్ద సంస్కృతం, కవిత్వం, సాహిత్యం తదితరాలను అధ్యయనం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే అపార పాండిత్యం గడించారు. ఆయా శాస్త్రాలను అధ్యయనం చేసిన కాలంలో అనుష్టానం, తపస్సు మినహా లౌకికమైన విషయాల్లో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆయన ప్రతిభను గ్రహించిన జగద్గురు తానే స్వయంగా శాస్త్రాలను బోధించారు. దీంతో తర్కశాస్త్ర పండితుడుగా అవతరించారు. ప్రతిష్ఠాత్మక వ్యాక్యార్థ విద్వత్ సభలు, ఏటా జరిగే జాతీయ శాస్త్ర పండితుల సభల్లోనూ తన ప్రసంగాలతో అందరినీ ఆశ్చర్యపరచ సాగారు. తర్వాత మీమాంస శాస్త్రం నేర్చారు. వేదాంతం నేర్చుకుంటూనే విద్యార్థులకు తర్కం, మీమాంస, వ్యాకరణశాస్త్రం బోధించసాగారు.
పీఠంతో పూర్వీకులకు అనుబంధం...
గుంటూరు జిల్లాతో శ్రీవిదుశేఖర భారతీ స్వామీజీకి ప్రత్యేక అనుబంధం
శ్రీవిదుశేఖర భారతీ స్వామి పెద్దలకు 1961 నుంచి శృంగేరీ పీఠంతో అనుబంధముంది. అప్పట్లో 35వ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వచ్చినపుడు, వీరి తాత సోదరుడు బైరాగిశర్మ స్వాగతం పలికి పాదపూజ చేశారు. 1985లో శృంగేరీ పీఠాధిపతికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. వీరి మరో తాత కుప్పా వెంకట చలపతి యాజీ 2002లో పీఠాధిపతి అనుమతితో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన సోదరుడు కుప్పా రామ గోపాల వాజపేయీ కృష్ణ యజుర్వేద పండితుడు. శృంగేరీ జగద్గురు భక్తుడు. ఆ క్రమంలోనే శ్రీవిదుశేఖర భారతీస్వామి తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని జగద్గురు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో చదివారు.
Comments
Please login to add a commentAdd a comment