ఐ–టీడీపీపై చర్యలు తీసుకోవాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సోషల్ మీడియాలో అసభ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టిన పోస్ట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, జిల్లా స్థాయి నాయకులతో కలిసి అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమా, తాడికొండ ఇన్‌చార్జి డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ సెల్ నాయకులు బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, మొండితోక శ్రీనివాస్, రమణారెడ్డిలు ఐదు ఫిర్యాదులు చేశారు. అనంతరం స్టేషన్ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన పోస్టులకు సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు ఫిర్యాదులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి రెండు మూడు రోజులపాటు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఐ–టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సవాల్ విసిరారు. మాజీ మంత్రి విడదల రజినీపై ఐ–టీడీపీ వారు చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు భయపడాల్సిన పని లేదన్నారు. పార్టీ అండగా ఉంటుందని, లీగల్ సెల్ రక్షణ కవచంగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి, కార్పొరేటర్లు రోషన్, మహమూద్, బూసి రాజలత, మల్లవరపు రమ్య, దూపాటి వంశీ, అంబేద్కర్, ఆచారి, కోఆప్షన్ సభ్యుడు పూనూరు నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, పార్టీ నాయకులు నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు కరువు
గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్పొరేటర్లు, జిల్లా, నగర స్థాయి నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులు పలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్టుకు సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఐ–టీడీపీలో సబ్జా అజయ్, స్వాతి రెడ్డి, అజయ్ చౌదరి, గాయత్రి పేరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోస్టులు పెట్టారని గుర్తుచేశారు. వాటిపైనా ఫిర్యాదు చేశామన్నారు. ప్రస్తుత రాష్ట్ర స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అయ్యన్నపాత్రుడు కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంత్రి లోకేష్ గురించి, టీడీపీ గురించి ఎక్కడైనా మాట్లాడితే తనను చంపుతానని ఘర్షణ టీవీ వెంగళరావు అనే వ్యక్తి కూడా బెదిరించారని, బూతులు మెసేజ్‌లు చేయడంతో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే కృష్ణసాగర్ అనే వ్యక్తి తన కుమార్తైపె పెట్టిన పోస్ట్‌ల గురించి, 99496 55108 అనే ఫోను నెంబర్ నుంచి బండ బూతులు తిడుతూ మెసెజ్‌లు చేస్తున్న వారిపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసులు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేస్తామని వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై పోస్ట్‌లు పెట్టిన వారిపై చర్యలెక్కడ? చంద్రబాబు చర్యలు తీసుకుంటామని ప్రకటించినా చేతల్లో మాత్రం శూన్యం మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపైనే ఫిర్యాదు చేశాం విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment