రామలింగేశ్వరునికి అన్నాభిషేకం
నగరంపాలెం: స్థానిక మల్లారెడ్డినగర్ అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీపర్వత వర్దిని సమేత శ్రీరామలింగేశ్వరస్వామికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీగణపతి సహిత రుద్ర హోమం చేశారు. కార్యక్రమాలను చంద్రశేఖరశర్మ, శివకుమార్‌శర్మ చేపట్టారు. మహా హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఎంకేఆర్ ఫౌండషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
యార్డుకు 43,356 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 17,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 9,000 నుంచి రూ. 14,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 9,000 నుంచి రూ. 16,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.10,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 31,944 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
వీర్ల అంకాలమ్మకు వెండి మకరతోరణం
దాచేపల్లి : స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లికి దాచేపల్లికి చెందిన దేవరశెట్టి బాలాంజనేయులు కుమారుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ10 లక్షల విలువ చేసే వెండి మకర తోరణం తయారు చేయించి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. దాత నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేసి మకర తోరణంతో అంకమ్మ తల్లిని అలంకరించారు. కమిటీ సభ్యులు దాత కుటుంబ సభ్యులను సన్మానించారు.
24న మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 24న కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, అసోసియేషన్ కార్యదర్శి మంతెన సుబ్బరాజు మంగళవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న 71వ అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు 9502925925 నంబరును సంప్రదించాలని కోరారు.
గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా ఐడీలు నమోదు
డెప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి
అచ్చంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి ఉప కేంద్రాలలో గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలకు ఐడీలను తప్పనిసరిగా నమోదు చేయాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పద్మావతి సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీల లింక్, ఎలాక్ట్రానిక్ హెల్త్ రికార్‌ుడ్స నమోదు, నాన్ కమ్యూనికేబుల్ డీసీజస్ అండ్ కమ్యూనికేబుల్ డీసీజస్ సర్వే వంటి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించారు. వైద్యాధికారులు డాక్టర్ వి.రాబాబునాయక్, డాక్టర్ సీహెచ్ స్రవంతిలకు సూచనలిచ్చారు. వ్యాక్సిన్లు నిల్వ ఉంచే కోల్డ్‌చైన్ సిస్టంను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వి.రాబాబునాయక్, డాక్టర్ స్రవంతి, ఆరోగ్య విస్తరణాధికారి పి.వెంకట్రావు, సీహెచ్‌ఒ శివనాగేశ్వరి, సూపర్‌వైజర్ పి.రాధాకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ సుభాని సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment