బాల్య వివాహాలను అరికట్టాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బాల్య వివాహాలను అరికట్టడం వల్ల దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, క్రాఫ్ట్, ఎన్జీఓ సంయుక్తంగా జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహ వ్యతిరేక వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాను బాల్య వివాహరహితంగా చేయాలని తీర్మానించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి టి.లీలావతి, నాలుగో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.కుమిదిని, ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి వై.గోపాలకృష్ణ. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ పీడీ విజయకుమార్, రాష్ట్ర సమన్వయకర్త జి.తిరుపతిరావు, ఐసీడీఎస్ నోడల్ అధికారిణి శ్రీవాణి, క్రాఫ్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కె.సమీర్, వెంకయ్య, ప్యానెల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్స్, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అథ్లెటిక్ ఓవరాల్ చాంపియన్‌గా ఎస్‌ఏవీఆర్ జెడ్పీ హైస్కూల్
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా, డెకథ్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన అండర్–12, 14, 16 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా యడ్లవల్లి ఎస్‌ఏవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో నరసరావు పేటకు చెందిన సింధూ హైస్కూల్ నిలిచింది. గుంటూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అనంతరం విజేతలకు డీఎస్‌డీఓ పి.నరసింహారెడ్డి, ప్రసాద్ బహుమతులు ప్రదానం చేశారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 2,010 క్యూసెక్కులు విడుదల చేశారు. హైలెవల్ కాలువకు 96, బ్యాంక్ కెనాల్‌కు 100, తూర్పు కెనాల్‌కు 50, పశ్చిమ కెనాల్‌కు 65, నిజాంపట్నం కాలువకు 200, కొమ్మమూరు కాలువకు 2,140 క్యూసెక్కులు విడుదల చేశారు.
సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ నంద
సంతమాగులూరు (అద్దంకి రూరల్): సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన న్యాయవాది పర్చూరు నంద సీనియర్ మహిళా విభాగం 76 కేజీల విభాగంలో 297.5 కేజీల బరువును ఎత్తి సౌత్ ఇండియా చాంపియన్‌గా నిలిచారు. తమిళనాడులోని సేలంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో సీనియర్, సబ్ జూనియర్, జూనియర్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఇందులో నంద ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతాకాన్ని కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు అభినందించారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.80 కోట్ల నగదును కానుకల రూపంలో సమర్పించారు. హుండీలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. రూ.3,80,77,021 నగదుతో పాటు 559 గ్రాముల బంగారం, 7.020 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment