అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు
కాకుమాను: అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి మండల అధికారులు ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఎంపీపీ తమలపాకుల హెబ్సిబా అన్నారు. పెదనందిపాడు మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్‌లో గురువారం ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులందరం అధికార పార్టీ నేతలకు సహకరిస్తామని తెలిపినట్లు ఆమె తెలిపారు. కానీ ఎంపీడీవో మండలానికి మంజూరైన నిధులను కనీసం తమ దృష్టికి తీసుకురాకుండా డ్వాక్రా సభ్యులు (టీడీపీ గ్రూపునకు) వర్క్ ఆర్డర్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తీర్మానం లేకుండా, కనీసం తన దృష్టికి తీసుకురాకుండా గ్రూపు సభ్యులకు వర్క్ మంజూరు చేయడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత ఎంపీపీని కాబట్టే ఎంపీడీవో తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ నిధులతో గ్రామంలో 7 సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాలతో వేరే వారికి అనుమతులు ఇవ్వడం కూడా అన్యాయమని ఆమె తెలిపారు. విషయాన్ని కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్, సీఈవోల దృష్టికి తీసుకువెళ్లి తమ హక్కులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. న్యాయపోరాటం కూడా చేస్తామని ఆమె తెలిపారు.
ఎంపీడీవో తీరుపై అభ్యంతరం
రోడ్ల నిర్మాణ విషయమై ఎంపీడీవోతో మాట్లాడేందుకు వచ్చిన మండలంలోని ప్రజా ప్రతినిధులకు గంటపాటు ఎంపీడీవో అనుమతి ఇవ్వలేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంత మందితో తాను మాట్లాడబోనని.. ఇద్దరో, ముగ్గురో వచ్చి సమస్యలను తెలపాలని ఎంపీడీవో తమ సిబ్బందితో సమాచారం పంపారు. పోలీస్‌లకు కూడా దీనిపై సమాచారం ఇచ్చారు. దీంతో అసహనానికి గురైన ప్రజా ప్రతినిధులు.. ఎంపీపీ చాంబర్‌లోకి ఎంపీడీవో రావాలని పట్టుబట్టారు. దీంతో గంట తరువాత ఎంపీపీ చాంబర్‌లోకి ఎంపీడీవో వచ్చారు. ఈ వ్యవహారంపై ఎంపీడీవోను ప్రజా ప్రతినిధులు నిలదీశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డ్వాక్రా గ్రూపునకు పనులు మంజూరు చేశానని, అలా చేయడం తప్పేపని ఎంపీడీవో అంగీకరించారు. దీంతో ప్రజాప్రతినిధులు శాంతించారు.
ఎంపీపీ తమలపాకుల హెబ్సిబా ఆరోపణ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదని ఆవేదన
వర్క్ ఆర్డర్ నిలిపివేత
డ్వాక్రా గ్రూపు సభ్యులకు కేటాయించిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్రజా ప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో వెంటనే ఏఈని పిలిచి, పనులు ప్రస్తుతానికి నిలిపివేయాలని ఎంపీడీవో సూచించారు. నాయకులతో చర్చించిన తర్వాత పనులు ప్రారంభించాలని సూచించారు. మండల ఉపాధ్యక్షుడు కమ్మా సాంబయ్య, పెదనందిపాడు సర్పంచ్ దాసరి పద్మారావు, వైస్ సర్పంచ్ దివి రాంబాబు, అన్నవరం ఎంపీటీసీ సుందరం, కొప్పర్తి ఎంపీటీసీ రమేష్, మండల కో–ఆప్షన్ సభ్యులు మస్తాన్‌వలి తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీడీవోకు పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీపీ హెబ్సిబా, ప్రజా ప్రతినిధులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment