డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన
నెహ్రూనగర్: వీధి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి వినియోగంపై డిజిటల్ అక్షరాస్యత పెంచుకోవాలని గుంటూరు జిల్లా ఎల్‌డీఎం రత్నమహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పాత గుంటూరులోని యూనియన్ బ్యాంకులో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైన రుణాలను అర్హులైన వీధి వ్యాపారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ విజయలక్ష్మి, మెప్మా సీఓ అహ్మద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
యడ్ల లింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్
35 వాహనాలు సీజ్, అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు
తెనాలి రూరల్: పట్టణ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యడ్ల లింగయ్య కాలనీలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో సుమారు 100 మంది పోలీసులు కాలనీలో ప్రతి ఇంటిని సోదా చేశారు. ఇళ్లలో ఉంటున్న వారి వివరాలను తెలుసుకున్నారు. వాహనాల పత్రాలను పరిశీలించారు. అనుమానితుల వివరాలను నమోదు చేసుకున్నారు. 30 బైక్‌లు, ఐదు ఆటోలకు సరైన పత్రాలు లేకపోవడంతో స్టేషనుకు తరలించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఒక్కసారిగా కాలనీకి రావడంతో ఏం జరిగిందో తెలియని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) జీవీ రమణమూర్తి, డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు పర్యవేక్షించారు. ఏడుగురు రౌడీ షీటర్లు ఉండగా ఐదుగురిని, మరో ఇద్దరు సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వాహనాల పత్రాలను సమర్పిస్తే తిరిగి అప్పగిస్తామని ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు.
లారీ ఢీకొని
ఇద్దరు దుర్మరణం
కాకుమాను: ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన దుర్ఘటన పెదనందిపాడు మండలంలోని వరగానిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌ఐ పృథ్వీ ఏకనాథ్ కథనం మేరకు.. వరగాని గ్రామానికి చెందిన తూమాటి శాంసన్ (62), దేవరపల్లి జాన్‌బాబు(14)లు గ్రామంలోని శ్మశాన వాటికలో కూలీ పనులు ముగించుకుని టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై ఇంటికి వస్తున్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి చీరాల వైపు వెళ్తున్న ఏపీ16 ఎక్స్2187 నెంబరు కలిగిన లారీ వీరిని ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత డ్రైవరు లారీని ఆపకుండా పారిపోయాడు. చీరాలలో గుర్తించి లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యార్డుకు 43,722
బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 43,722 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 43,251 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ. 16,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 39,427 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment