బాలికలపై ఘోరాలు!
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. బాలికల రక్షణ విషయంలో అడుగడుగునా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా బాలికల వసతిగృహాలలో ఎన్ని ఘోరాలు చోటుచేసుకుంటున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న ఎందరో బాలికలపై అత్యాచారాలు జరగడం, ఆకతాయిల వలలో చిక్కుకుని మోసపోవడం వంటి ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు.
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో 14 ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టళ్లలో 1,380 మంది, 12 బీసీ బాలికల సంక్షేమ హాస్టళ్లలో 1,012 మంది, 3 ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో 397 మంది బాలికలు, విద్యార్థినులు ఉన్నారు. సదరు వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి. నెలలో నాలుగు సార్లు వారు తనిఖీలు చేయాల్సి ఉండగా.. వార్డెన్ల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని తూతూ మంత్రంగా ఈ ప్రక్రియను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీ చేయకున్నా చేసినట్లుగా తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అన్నీ కంటి తుడుపు చర్యలే..
గుంటూరు నగరం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని సాంఘిక సంక్షేమ హాస్టల్ (పరివర్తన భవన్)లో ప్రకాశం జిల్లాలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని ఉంటోంది. గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితురాలి సాయంతో పాపకు జన్మనిచ్చింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సీరియస్ అయ్యారు. వెంటనే పరివర్తన భవన్ వార్డెన్ జయప్రదను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏఎస్‌డబ్ల్యూఓ) చెంచులక్ష్మీపై చర్యలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ డైరెక్టర్‌కు సిఫార్సు చేశారు. ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకులు ఎవరనే విషయం తేలాల్సి ఉంది.
ముడుపులతో సరి
నగరంలోని జూట్ మిల్ వద్ద ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులను గతంలో ఇద్దరు ఆకతాయిలు బయటికి తీసుకువెళ్లారు. దీనిపై దుమారం రేగడంతో రెండు రోజుల తరువాత పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ విషయంలో వార్డెన్‌కు కంటితుడుపు చర్యగా మెమో ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఆ తరువాత విచారణ కొనసాగకుండా జిల్లా అధికారులకు సదరు వార్డెన్ ముడుపులు ఇచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని స్టాల్ బాలికల కాంపౌండ్‌లోని బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో ఉండే విద్యార్థినిని ఓ ఆకతాయి మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. సదరు విషయాన్ని తోటి విద్యార్థిని ఒకరు హాస్టల్ వార్డెన్‌కు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఇందులో కూడా వార్డెన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే ఓ ఉద్యోగినిని విధుల నుంచి తొలగించారు. అధికారులను వార్డెన్ మేనేజ్ చేయడంతో ఎటువంటి విచారణ జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. పరివర్తన భవన్‌లో దాదాపు 350 మందికిపైగా విద్యార్థినులు ఉన్నారు. వీరందరికీ ఒక వార్డెన్ మాత్రమే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కమాటీ, కుక్, వాచ్ మెన్ వంటి పోస్టులు కలిపి సుమారు పది మంది వరకు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. వార్డెన్ దీనిపై లేఖలు రాసినా అధికారులు స్పందించడం లేదు. ఎంత ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వారికి తగ్గట్టు ఉన్నతాధికారులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
వైద్య శిబిరాల ఊసేది?
సదరు విద్యార్థిని 9 నెలలుగా గర్భంతో ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్‌లో బస చేసింది. వార్డెన్‌కి ఈ విషయం తెలియకపోవడం చూస్తుంటే పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి రూములను ప్రతి రోజు తనిఖీ చేయడం, ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించి విద్యార్థినుల బాగోగులు చూసుకోవాలి. విద్యార్థిని నిండు గర్భంతో ఉన్నా గుర్తించపోవడం అంటే ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
వసతి గృహాల్లో విద్యార్థినులపై పెరుగుతున్న అఘాయిత్యాలు
పర్యవేక్షణ లోపంతో అమాయకుల జీవితాలు ఛిద్రం తాజాగా శిశువుకు జన్మనిచ్చిన బీ ఫార్మసీ విద్యార్థిని చిన్న వయస్సులో మాయగాళ్ల చేతిలో మోసపోతున్న బాలికలు మామూళ్ల మత్తులో తనిఖీలు మరిచిన అధికారులు వార్డెన్లపై నామమాత్రపు చర్యలతో ఘటనలు పునరావృతం
అధికారులపై చర్యలు తీసుకోవాలి
సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రతి నెల హాస్టళ్లను పరిశీలించడం లేదు. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. మూడు నెలల క్రితం ఓ హాస్టల్‌లో ఇద్దరు బాలికలు అదృశ్యమైతే, రెండు రోజుల తరువాత పట్టుకున్నారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోలేదు. వార్డెన్ల నుంచి అధికారులు ముడుపులు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
– నవ్య శ్రీ, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment