ఖోఖో పోటీల విజేతగా విక్టరీ డిగ్రీ కళాశాల
గుంటూరు ఎడ్యుకేషన్: పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల క్రీడా మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఏఎన్‌యూ అంతర్ కళాశాలల పురుషుల ఖో ఖో పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో నరసరావుపేటలోని విక్టరీ డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. డీసీఆర్‌ఎం డిగ్రీ కళాశాల (ఇంకొల్లు ), కృష్ణవేణి డిగ్రీ కళాశాల (నరసరావుపేట), వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) తర్వాతి మూడు స్థానాల్లో నిలిచినట్లు కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం తెలిపారు. ఏఎన్‌యూ పురుషుల ఖో ఖో టీంకు ఎంపికై న క్రీడాకారుల్లో డిగ్రీ కళాశాలలైన విక్టరీ నుంచి 5, డీసీఆర్‌ఎం – 4, కృష్ణవేణి – 2 , వాగ్దేవి –1, యూనివర్సిటీ వ్యాయామ కళాశాల – 1, జేకేసీ – 1, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు వర్సిటీ పరిశీలకుడు డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు.
క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, తద్వారా క్రీడాస్ఫూర్తి అలవరుచుకోవాలని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జయ కాటన్ అధినేత ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ క్రమశిక్షణతో లక్ష్య సాధన సాధ్యమన్నారు. కళాశాల కోశాధికారి వి.కృష్ణానంద్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కళ్ళం హరనాథ్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో సులభంగా చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాంసుందర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, వ్యాయామ అధ్యాపకుడు ఆర్.శివాజీ, డిగ్రీ ఇన్‌చార్జి భాను మురళీధర్, ఖో ఖో సెలక్షన్ సభ్యులు గణేష్, డాక్టర్ వెంకటరావు, వర్సిటీ వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ పాతూరి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా ఖో ఖో క్రీడా అధ్యక్షుడు వి.వీరభద్రా రెడ్డి, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment