అధికార పార్టీ అండతోనే కబ్జా యత్నం
లక్ష్మీపురం : అద్దెకు నివాసం ఉంటున్న వారిని కట్టు బట్టలతో బయటకు పంపించి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘నాతో పెట్టుకోండి. నా ఇంటిపైకి రండి. అంతేగానీ అనారోగ్యంతో పక్షవాతం వచ్చి బాధపడుతున్న నా సోదరి ఇంటిపై ఆటోలలో దుండగులతో వచ్చి కబ్జా చేయడం తగదు. పసి పాప ఉందని కూడా చూడకుండా ఇంట్లో నుంచి అందర్నీ బయటకు పంపిచేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన సోదరుడు రవి అండదండలతో ఈ దౌర్జన్యం జరుగుతోంది. ఇది సరి కాదు. అసలు సదరు ఇంటికి, అధికార పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న విజయ్‌కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. పాములూరి రామయ్య, పత్రి ఆనంద్‌మోహన్ అనే వారి మధ్య నడుస్తున్న సివిల్ వివాదంలో తలదూర్చి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి. ఈ విషయంలో విజయ్‌కిరణ్ కూడా పేరం వెంకటేశ్వర్లు వద్ద స్థలం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. పేరం వెంకటేశ్వర్లు స్వయంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో 2017లో ఈ స్థలంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్టేట్‌మెంట్ ఇచ్చిన పత్రం కూడా ఉంది. గతంలో కమిషనర్‌గా వ్యవహరించిన లత్కర్ సైతం ఈ స్థలం వద్దకు వచ్చి వివరాలను సేకరించారు. మా సోదరి అద్దె నివాసంలో చిన్న పిల్లలు, మహిళలు ఉంటే దౌర్జన్యంగా ఆటోలలో వచ్చి కబ్జాకు పాల్పడిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. అనారోగ్యంగా ఉన్న నా సోదరి, ఆమె కుటుంబం ఇప్పుడు ఎక్కడ తలదాచుకోవాలి.’ అని పేర్కొన్నారు. దీంతో పట్టాభిపురం సీఐ వీరేంద్ర అత్యుత్సాహంతో అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం డైమండ్ బాబును స్టేషన్‌కు బలవంతంగా జీపు ఎక్కించి తరలించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ జోక్యంతో డైమండ్ బాబును స్టేషన్ నుంచి విడిచి పెట్టారు. స్టేషన్ ముందు మీడియాతో డైమండ్ బాబు మాట్లాడుతూ.... బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా టీడీపీ నేతల కనుసనల్లో పోలీసులు నడుస్తున్నారంటూ డైమండ్ బాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు వివాదం విషయంలో పట్టాభిపురం పోలీసులు అక్రమంగా తనను స్టేషనుకు తరలించారని మండిపడ్డారు. కోర్టు పెండింగ్లో ఉన్న కేసు విషయంలో పోలీసులు ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఒక ఇంటిపై దాడి చేసి ఇష్టానుసారంగా వ్యవహరించిన టీడీపీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కిరణ్‌కు మద్దతుగా పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తే ఇకపై తమ రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు. మహిళలని కూడా చూడకుండా తన సోదరి, నివాసంలోని వారిపై దాడులు చేసి గాయపరిచిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటివరకు కనీసం కేసులు నమోదు చేయకపోగా, తనను బలవంతంగా స్టేషనుకు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌తో కలిసి వచ్చి కోర్టులో ఉన్న నివాసానికి సంబంధించిన తాళాలు వేయడంపై దుయ్యబట్టారు. దీనిపై తాము కూడా న్యాయపరంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. డైమండ్ బాబుకు మద్దతుగా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తదితరులు స్టేషన్‌కు వచ్చి అధికారులతో చర్చించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు తరలివచ్చారు.
ఇంటితో విజయ్‌కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు
డైరెక్షన్ అంతా కేంద్ర మంత్రి పెమ్మసాని, ఆయన సోదరుడు రవిదే
కబ్జాకు యత్నించిన వారికి పోలీసుల వత్తాసు
విలేకరుల సమావేశంలో డెప్యూటీ మేయర్ డైమండ్ బాబు
Comments
Please login to add a commentAdd a comment