నిలిచిన బిల్లు కలెక్టర్ల సేవలు
● విద్యుత్తు బిల్లులు చెల్లించలేక నిరక్షరాస్యులు, వృద్ధుల అవస్థలు ● ఏజెన్సీ కొనసాగింపునకు చర్యలు తీసుకోని అధికారులు
తెనాలి: గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. నెలనెలా వసూలు చేసే బిల్లు కలెక్టర్లు డిసెంబరు నెలలో కనిపించటం లేదు. దీంతో నిర్లక్ష్యరాస్యులైన గ్రామీణులు, వృద్ధులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లోని కలెక్షన్ సెంటర్లు మూసివేసి కనిపిస్తున్నాయి. కేవలం గుంటూరు జిల్లాలోనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. బిల్లుల చెల్లింపునకు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని తాత్కాలిక కలెక్షన్ సెంటర్లు నడిచేవి. విద్యుత్‌శాఖ తరఫున కొందరు బిల్లు కలెక్టర్లు ప్రతినెల అక్కడకు వస్తుండేవారు. 15వ తేదీలోగా వసూలు చేసుకుని రసీదు ఇచ్చి వెళుతుండేవారు. తెనాలి విద్యుత్ రెవెన్యూ కార్యాలయం పరిధిలోని తెనాలి, వేమూరు, కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల, చుండూరు, అమృతలూరు, చేబ్రోలులో మొత్తం 13 మంది బిల్లు కలెక్టర్లు ఉండేవారు. గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం యాభైమందికి పైగా విధులు నిర్వహిస్తుండేవారు. డిసెంబరు నెల విద్యుత్ బిల్లుల వసూలుకు వీరెవరూ క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. తెనాలికి సంబంధించి శాలివాహన సేవాసంఘం అనే ఏజెన్సీ ఈ సేవలను అందిస్తున్నట్టు తెలిసింది. దీని గడువు గత నెల 15వ తేదీతో పూర్తయిందని చెబుతున్నారు. గడువు పొడిగించటం లేదా కొత్త ఏజెన్సీని తీసుకోవటం ఇంకా జరగనే లేదు. కేవలం గుంటూరు జిల్లాలోనే ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే వారి సంఖ్య ఎక్కువైందని, ఆ విధానాన్నే ప్రోత్సహించాలనే భావనతో ఉదాసీనంగా ఉన్నారనే అభిప్రాయమూ వినవస్తోంది. బిల్ కలెక్టర్ల నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు డిపాజిట్ చెల్లించుకుని ఏజెన్సీ వారు బాధ్యతలను అప్పగిస్తారు. ఈ పనిలో పది, పదిహేనేళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు వీరి ఉపాధి ప్రశ్నార్థకమైంది. సెక్షన్ కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని ఏఈ, ఏడీఈ, డీఈలకు ఇప్పటికే పంపారు. ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులకు ఈ విషయం చెబితే ఈ సమస్య తమ దృష్టికి రాలేదని చెప్పినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment