జాతీయ యువజన ఉత్సవాలకు ఏఎన్‌యూ విద్యార్థులు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు మార్చి 5న నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో జరిగే జాతీయ యువజన ఉత్సవ పోటీల్లో పాల్గొననున్నట్లు యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధర రావు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 30వ తేదీవరకు చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగిన సౌత్ జోన్ యువజన ఉత్సవాల పోటీల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వీసి విద్యార్థులను అభినందించారు. యువజనోత్సవాల కో–ఆర్డినేటర్ ఆచార్య ఎస్.మురళీమోహన్, డాక్టర్ రమీ బేగంలను అభినందించారు. యువజన ఉత్సవాల్లో వర్సిటీ విద్యార్థులు స్పాట్ ఫొటోగ్రఫీ, మెహందీ, మైమ్, ఇన్ స్టాలేషన్, కార్టూనింగ్ విభాగాల్లో పతకాలు సాధించినట్లు యువజన ఉత్సవాల కో–ఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లను వీసీ ఆచార్య కె.గంగాధర రావు, రెక్టర్ ఆచార్య కె.రత్న షీలా మణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం తదితరులు అందజేశారు.
ఫార్మసీ విద్యార్థులకు అవగాహన..
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగంలో ఈసీసీహెచ్‌ఓ ఓవర్సీస్ ఆధ్వర్యంలో ఫార్మసీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫార్మసీ విభాగ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రమీలారాణి పొల్గొన్నారు. ఈసీసీహెచ్‌ఓ ఓవర్సీస్ ఛైర్మన్ డాక్టర్ నల్లమోతు రమేష్ విద్యార్థులకు యూకే, యుఎస్‌ఏ, ఐర్లాండ్ దేశాల్లో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు, అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విదేశాల్లో చదవడం ద్వారా కెరీర్‌ను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశాలపై విద్యార్థులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రమీలారాణి, రేణుకాదేవి పాల్గొన్నారు.
జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగం ఆధ్వర్యంలో మార్చి 6, 7 తేదీల్లో నిర్వహించే జాతీయ సదస్సు బ్రోచర్‌ను మంగళవారం వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఆవిష్కరించారు. ఎడ్యుకేషనల్ పర్‌స్పెక్టివ్స్ అండ్ రోల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు డైరెక్టర్ ఆచార్య పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సదస్సుకు పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు వచ్చిన పరిశోధన పత్రాలు పరిశీలించి పబ్లికేషన్ తీసుకొస్తామని తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా రెక్టర్ ఆచార్య రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యావిభాగం బీఓఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ శివలక్ష్మి, అతిథి అధ్యాపకులు డాక్టర్ సందీప్, డాక్టర్ వసంతరావు, డాక్టర్ శివరామిరెడ్డి, పరిశోధకులు ఆలీ భాష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment