మర్యాదపూర్వక కలయిక
పట్నంబజారు: రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని మంగళవారం పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయంలో కలిసి.. శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ సీపీ మహిళా నేతలు ఆమెతో ఉన్నారు.
దేశానికి గర్వకారణంగా
నిలిచిన కోనేరు హంపి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ మహిళా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించిన కోనేరు హంపి దేశానికే గర్వకారణంగా నిలిచారని శ్రీపాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాల కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి మండలం కొలనుకొండలోని కోనేరు హంపి నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షించారు. కాటన్ అడ్వైజర్ బోర్డు మాజీ సభ్యుడు అత్తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సిమ్లాలో శిక్షణకు ఆంధ్ర ముస్లిం కళాశాల విద్యార్థి
గుంటూరు ఎడ్యుకేషన్: ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే లక్ష్యంతో 100 కిలోమీటర్ల ఆల్ట్రారన్ శిక్షణ కోసం సిమ్లాలో జరిగే శిక్షణకు వెళుతున్న ఆంధ్ర ముస్లిం కళాశాల డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థి షేక్ సుభానీని కళాశాల కరస్పాండెంట్ షేక్ సుభానీ మంగళవారం అభినందించారు. పొన్నూరురోడ్డులోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సుభానీ మాట్లాడుతూ దేశానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చే క్రీడాకారులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థికి రూ.10వేలు అందజేశారు. మహ్మదీయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు షేక్ రెహ్మాన్, సలహాదారుడు డాక్టర్ ఎండీ మస్తాన్‌వలీ, ప్రిన్సిపాల్ షేక్ షాహీనా బేగం, అధ్యాపకులు పాల్గొన్నారు.
కులగణనపై సవరణల
అర్జీలకు గడువు పెంపు
నెహ్రూనగర్: ఎస్సీ కులగణన జాబితాలో సవరణలకు మంగళవారం ఆఖరిరోజు అని గతంలో ప్రకటించామని, ప్రజలకు మరింత గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం జనవరి 12 వరకు పొడిగించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తయిన కుల గణన జాబితాలను 2024 డిసెంబర్ 26న నగరంలోని 206 వార్డ్ సచివాలయాల నోటీసు బోర్డుల్లో సందర్శనార్ధం ఉంచామన్నారు. నగర ప్రజలు సర్వే రిపోర్ట్ లోని తమ వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవచ్చని సూచించారు. పేర్లు, సబ్ కేటగిరీ వివరాలు తప్పుగా ఉన్నా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్థానిక సచివాలయంలో అడ్మిన్ కార్యదర్శి, వీఆర్‌ఓలకు లిఖిత పూర్వకంగా అర్జీలు అందించవచ్చని తెలిపారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో విచారించి, విచారణ మేరకు తుది జాబితాలో నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment