మహోగ్రమై ప్రజ్వరిల్లే | - | Sakshi
Sakshi News home page

మహోగ్రమై ప్రజ్వరిల్లే

Published Sat, Dec 28 2024 1:59 AM | Last Updated on Sat, Dec 28 2024 1:58 AM

మహోగ్రమై ప్రజ్వరిల్లే

మహోగ్రమై ప్రజ్వరిల్లే

పొన్నూరులో నిరసన వ్యక్తం చేస్తున్న అంబటి మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు

తెనాలిలో ప్రదర్శన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు

● మంగళగిరి పట్టణం కొప్పురావు కాలనీలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అంతకుముందు నాయకులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్‌, పార్టీ నేత ఈదులుమూడి డేవిడ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

● తాడికొండ అడ్డరోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, గుంటూరు నగర డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సాధారణ జనజీవనానికి ఆటంకం కలగకుండా రోడ్డుపక్కన టెంట్‌, కుర్చీలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. టెంట్‌, కుర్చీలను తొలగించి కాలువలో పడేశారు. దీనిపై స్పందించిన డైమండ్‌బాబు తాడికొండ సీఐ కె.వాసుతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్షంపై ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా శుక్రవారం మహోగ్రమై ప్రజ్వరిల్లింది. కూటమి సర్కారు ద్వంద్వనీతిపై ధ్వజమెత్తింది. నయవంచక పాలనపై గళమెత్తింది. జనకంటక ప్రభుత్వానికి ఇది ప్రళయ సంకేతమని గర్జించింది. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో విద్యుజ్జ్వాలై రగిలింది. విద్యుత్‌ కార్యాలయాల వద్దకు ఊరూవాడా కదంతొక్కింది. ‘సర్దుబాటు’ బాబూ ఖబడ్దార్‌.. ఇక ‘సర్దు’కో బాబూ అంటూ నినదించింది. కుటిల కూటమికి చరమగీతం తప్పదని హెచ్చరించింది.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): విద్యుత్‌ చార్జీల పెంపుపై ప్రజల పక్షాన వైఎస్సార్‌ సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా దిగ్విజయమయ్యాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, నాయకులతోపాటు ప్రజలూ స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సర్దుబాటు చార్జీల పేరుతో రూ.వేల కోట్ల భారం మోపటంపై మండిపడ్డారు.

● వైఎస్సార్‌ సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌ భవన్‌ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ గుంటూరు, పల్నాడు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లాంతర్లు పట్టుకుని పెరిగిన విద్యుత్‌ ధరలపై నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ పి.మూర్తికి వినతిపత్రం అందజేశారు. ముందుగా ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

● తెనాలి పట్టణం చెంచుపేటలోని విద్యుత్‌ డీఈ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా చెంచుపేట నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో నినాదాలు చేసి, అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తాడిబోయిన రాధిక, కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతిసంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, దుబాయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

● పొన్నూరు పట్టణంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా కార్యకర్తలతో అంబటి సమావేశమయ్యారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భవనం పద్మలీల, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

● ప్రత్తిపాడులోని గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డులో ఉన్న మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ కాంస్య విగ్రహం నుంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్ళారు. అనంతరం అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తరువాత ఏఈ గౌతమ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నూనె ఉమామహేశ్వరరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, బాపతు వెంకటేశ్వరరెడ్డి, ఖాశీంపీరా, ఓంప్రకాష్‌రెడ్డి, బాపతు వెంకటరమణ, పరమారెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం ఇస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమా

వినతిపత్రం అందజేస్తున్న అంబటి రాంబాబు, మనోహర్‌ నాయుడు

సర్దుబాటు బాబూ.. ఇక ‘సర్దు’కో బాబూ!

కదంతొక్కిన ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు గళమెత్తి గర్జించిన ఊరూవాడా ఆందోళనలతో అట్టుడికిన గుంటూరు జిల్లా

వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

గుంటూరు ఎడ్యుకేషన్‌: సీఎం చంద్రబాబు నయవంచకుడని, అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఆయన నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బాబుకు ఓట్లేసిన ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు గుజ్జనగుండ్లలో విద్యుత్‌ శాఖ డీఈఈ కార్యాలయం వద్ద పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యమకారులపై కాల్పులు జరిపించి అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌ సీపీ నిరంతర పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

జగన్‌కు అమిత ప్రజాదరణ

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారని అంబటి చెప్పారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఘనత జగన్‌ సొంతమన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, ఈచంపాటి వెంకట కృష్ణ, పడాల సుబ్బారెడ్డి, షేక్‌ రోషన్‌, బూసి రాజలత, గురవయ్య, వైసీపీ నాయకులు సూరసాని వెంకట్‌రెడ్డి, మామిడిరాము, వంగల వలివీరారెడ్డి, మండేపూడి పురుషోత్తం, బత్తుల దేవానంద్‌, కరీంబేగ్‌, ఉడతా కృష్ణ, సాంబశివరావు, మాదాసు భాగ్యారావు, ఆటో యూనియన్‌ నేత మురళి పాల్గొన్నారు. అనంతరం విద్యుత్‌ శాఖ డీఈఈ నాసరయ్యకు వినతి పత్రం సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement