అమ్మా.. క్షమించు!
పట్నంబజారు: పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరిగే అన్నదానాన్ని అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 నుంచి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. కార్మికులు, కూలీలు, అనాథలు, పేదలు నిత్యం వస్తుంటారు. ప్రతిరోజూ 300 నుంచి 400 మంది వరకు ఆలయం ముందు పేదల ఆకలి వాసవీ క్లబ్ సభ్యులు తీరుస్తున్నారు. అయితే, నిత్యాన్నదానాన్ని ఇటీవల నిలిపివేశారు. అధికార పార్టీ నేతల హుకుం జారీతో అధికారులు సైతం డూడూ బసవన్నల్లా మారిపోయారు. కనీసం పేదల ఆకలి తీరుస్తున్నారన్న జాలి కూడా లేకుండా నిత్యన్నదాన పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.
వై.ఎస్.జగన్ పుట్టినరోజే కారణమా?
ఆలయం ఎదుట వాసవీ క్లబ్ నిర్వహించే అన్నదానానికి ఎంతో మంది దాతలు వితరణ చేస్తుంటారు. అయితే, గత ఏడాది డిసెంబరు 21న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వాసవీ క్లబ్‌లో అన్నదానానికి డొనేషన్లు అందజేశారు. ఈవిషయం తెలుసుకున్న ప్రస్తుతం ఆలయంలో హడావుడి చేస్తున్న అధికారికి పార్టీకి చెందిన కొంత మంది నేతలు, ఆలయ అధికారుల ద్వారా నిత్యన్నదానాన్ని నిలువరించారు. ఎటువంటి అన్నదానం చేయరాదంటూ అధికారులకు బెదిరింపులకు గురిచేసి హుకుం జారీ చేయించారు. అధికార పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక అన్నదానాన్ని నిలిపివేయాలంటూ అధికారులు సైతం తలొగ్గారు. అయితే, గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు అనేక సినిమా స్టార్‌ల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాల్లో అన్నదానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వై.ఎస్.జగన్ జన్మదినం నుంచి అన్నదానాన్ని నిలిపివేయడంతో కూలీలు, పేదలు, అనాథలు ఆకలితో అలమటిస్తున్నారు.
అధికార పార్టీ నేతల అడ్డా
ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటికే స్పష్టంగా ఒక కమిటీ ఉంది. అయినా అధికార పార్టీకి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఒక కార్పొరేటర్, నియోజకవర్గ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ తానే అంతా అంటూ చెప్పుకుంటున్న మరో దుకాణ యజమాని ఆలయంలో పెత్తనం చెలాయిస్తున్నారు.
పేదల పొట్ట కొడుతున్న టీడీపీ నేతలు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిత్యాన్నదానం నిలిపివేత
వారం రోజులుగా భోజనం లేదు
శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నిత్యం అన్నదానం ఉండేది. ఇక్కడే దుకాణం పనులు చేసుకుంటూ మధ్యాహ్నం దేవాలయానికి వచ్చి భోజనం చేసేవాడిని. గత వారం రోజులుగా నిత్యం వస్తున్నప్పటికీ భోజనం లేదని చెబుతున్నారు. ఎందుకు ఆపారనేది ? తెలియదు. నిత్యం మాలాంటి పేదలకు కడుపు నింపే భోజన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నా.
– నాగసాయి, కార్మికుడు
ఆర్జేసీ అనుమతి కావాలి
ఆలయం ఎదురుగా నిర్వహిస్తున్న అన్నదానానికి సంబంధించి ఆర్జేసీ అనుమతులు కావాలి. ఆలయం ఎదుట వాసవీ క్లబ్ వారు నిర్వహించడం వారే ఆపేశారు. ఆలయం ద్వారాల వద్ద పేదలకు అన్నదానం చేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి.
– జి.మాధవి,
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment