సొంతూరుకు చలో..చలో !
ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈనెల 9 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడం, రెండో శనివారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సెలవులు కావడంతో భారీగా పట్టణాల నుంచి పల్లెలకు బస్సులు తరలి వెళుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో బస్టాండ్ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈనెల 9, 10, 11, 12 తేదీల్లో భారీగా ఆర్టీసీకి ఆదాయం చేకూరనుంది. నిత్యం 40 నుండి 50వేల మంది ఆర్టీసీ ద్వారా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పండుగ నేపథ్యంలో సుమారు లక్ష మంది గుంటూరు రీజియన్ పరిధిలోని గుంటూరు–1,2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోల ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మామూలు రోజుల్లో ఆర్టీసీ ఆదాయం రూ. 50 లక్షలు వస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రద్దీ భారీగా ఉండటంతో రూ. 70 లక్షల మేరకు నిత్యం ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా గుంటూరు రీజియన్‌లోని ఆయా డిపోలకు చేరుకునేందుకు హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, చైన్నె, ఇతర ప్రాంతాల నుంచి 150 బస్సులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. పండుగ అనంతరం తిరుగు ప్రయాణానికి తగ్గట్లు బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
– పట్నంబజారు
Comments
Please login to add a commentAdd a comment