ఉద్యోగం, స్థలం ఇప్పిస్తానని టోకరా
మంగళగిరి (తాడేపల్లి రూరల్): ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని మంగళగిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ వినోద్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు శ్రీనివాసాపురానికి చెందిన చుక్కా బాబు అలియాస్ లవ్‌బాబు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళగిరి మండలం ఆత్మకూరులో నివాసముంటున్నాడు. జల్సాలకు అలవాటుపడి స్నేహితులతో కలసి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. స్నేహితుల ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని వాటిల్లో తిరుగుతూ కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫొటోలు దిగేవాడు. ఈ క్రమంలో మంగళగిరి బస్టాండ్ వద్ద ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు చూసి, అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. ఇల్లు అద్దెకు కావాలంటూ యజమాని దాసరి రామమోహనరావును పరిచయం చేసుకున్నాడు. ఆయన తమ్ముడికి ఉద్యోగ అవసరం ఉందని తెలుసుకుని హైకోర్టులో ఇప్పిస్తానని నమ్మబలికాడు. అప్పటికే అతని ఫోన్‌లో దిగిన ఫొటోలు చూపించాడు. ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మి రామమోహనరావు రూ. 10 లక్షలు ఇచ్చాడు. అనంతరం హైకోర్టులో స్టెనోగా పనిచేసే అరుణ్ అనే వ్యక్తి చనిపోయాడని, అతని పేరున ఉన్న రెండు ఎకరాలు హైకోర్టు న్యాయమూర్తుల కస్టడీలో ఉందని తెలిపాడు. రూ. 49 లక్షలు ఇస్తే ఆ భూమిని నలుగురు జడ్జిలతో రామమోహనరావు పేరున రిజిస్టర్ చేస్తానని నమ్మబలికాడు.అతడి దగ్గర నుంచి ఉద్యోగం, భూమి నిమిత్తం మొత్తం రూ. 59 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత వాటి గురించి రామమోహనరావు అడగ్గా అదిగో ఇదిగో అంటున్నాడు. దీంతో 2024 నవంబర్‌లో చుక్కా బాబు అతని స్నేహితులు వంశీకృష్ణ, తరుణ్, అతని కుటుంబ సభ్యులపై మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రామమోహనరావు ఫిర్యాదు చేశాడు. శనివారం చుక్కా బాబు విజయవాడలో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ వినోద్‌కుమార్ సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. గతంలో చుక్కా బాబుపై పోక్సో యాక్ట్, 498ఎ, చీటింగ్ కేసులతో పాటు పలు కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లు గానీ, ఇలాంటి వ్యక్తులను గానీ ఎవరూ నమ్మవద్దని సీఐ సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వినోద్‌కుమార్ కోరారు.
రూ .59 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో వ్యక్తి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment