పొన్నూరు విచ్చేసిన ఒడిశా గవర్నర్ హరిబాబు
పొన్నూరు: ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు శనివారం పొన్నూరు వచ్చారు. నిడుబ్రోలుకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పాములపాటి అంకినీడు ప్రసాదరావు సతీమణి శివప్రదాదేవి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
నేడు దర్గా టు
దుర్గ కాలి నడక
పెదకాకాని: జాతి సమైక్యత కోరుతూ వీవీఐటీ ఆధ్వర్యంలో దర్గా టు దుర్గ కాలి నడక నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటలకు గుంటూరు మస్తాన్ దర్గా నుంచి విజయవాడలోని దుర్గ గుడికి నడక ప్రారంభమవుతుందని చెప్పారు. 1500 మంది విద్యార్థులతో 33 కిలోమీటర్లు మేర ఈ కాలినడక కొనసాగుతుందని చైర్మన్ పేర్కొన్నారు.
వైభవంగా
గోదాదేవికి పూజలు
తాడేపల్లి రూరల్: మంగళగిరి బాపూజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస కార్యక్రమాలలో శనివారం 27వ రోజు 27వ పాశురాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా జీయర్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థ ప్రసాద గోష్టి, మంగళ శాసనాలతో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది భక్తులు గోదా అమ్మవారికి సారెను సమర్పించి స్వామి వారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. కూడారై (పాయసం) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు.
నేడు సూపర్‌స్టార్ కృష్ణ
కాంస్య విగ్రహావిష్కరణ
తెనాలి: ప్రఖ్యాత సినీ హీరో, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం తెనాలిలో ప్రతిష్టించనున్నారు. ఆలిండియా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, తెనాలి ఆధ్వర్యంలో తెనాలి–విజయవాడ రోడ్డులోని తెనాలి బండ్‌పై సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రముఖ సినీనిర్మాత, పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొంటారు.
కోడి పందేలు వేస్తే
కఠిన చర్యలు
గుంటూరు వెస్ట్: పవిత్ర పండుగలను సంతోషాలతో జరుపుకోవాలని, జీవ హింసకు పాల్పడవద్దని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం కోడి పందేల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోడి పందాలను ఆడినా నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని, దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసాశాని పేర్కొన్నారు. ఈ బృందాలు ఈ నెల 17 వరకు గ్రామాల్లో సచరిస్తాయని తెలిపారు. నిత్యం వారు పహారా కాస్తారని తెలిపారు. ప్రజలు సమాచారం అందితే స్థానిక పోలీసులకు గానీ, రెవెన్యూ అధికారులకు గానీ తెలపాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాఽథ్, డీఆర్వో ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment