ఐదుగురు విశిష్ట మహిళలకు సత్కారాలు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్): స్థానిక బృందావన్‌గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విశిష్ట మహిళా మూర్తులకు మంగళవారం సత్కారం జరిగింది. గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద సాంబశివరావు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. గుంటు పల్లి ఆరుణజ్యోతి, సత్కారగ్రహీతలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత వహించారు. 70 వసంతాల వయస్సుపైబడి పలు రంగాల్లో నిష్ణాతులైన దేవాలయ పాలక మండలి గౌరవాధ్యక్షరాలు ఆధ్యాత్మిక సేవా శిరోమణి గద్దె రామతులశమ్మ (ఆధ్యాత్మిక), వేమూరి రామలక్ష్మి (సంగీతం), డాక్టర్ సి.హెచ్. సుశీలమ్మ (సాహిత్యం), వి.ఎన్.డి.శ్యామసుందరీ దేవి (విద్యా), మాధవపెద్ది మీనాక్షి (సంగీతం)లను సత్కరించారు. ఆధ్యాత్మిక సేవాశిరోమణి, ధార్మిక సేవారత్న గద్దె రామతులశమ్మ జీవనయానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్.విజయలక్ష్మి, గుళ్ళపల్లి స్వాతి, అర్ధలపూడి నేహ, గుళ్ళపల్లి రాఘవరావు పాల్గొన్నారు. అనంతరం శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి నాట్యాచార్య డాక్టర్ కాజ వేంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం స్వాగతాంజలి నృత్యం ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment