దిగజారుడు రాజకీయాలు
గుంటూరు నగరంలో టీడీపీ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నేతలు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. కేవలం 11 సీట్లు ఉన్న కూటమి, ఎన్నికల ముందు కొంత మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిందని, ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కక్కిన కూటికి ఆశపడుతోందని విమర్శించారు. తాము క్యాంపు పెట్టుకుని కార్పొరేటర్లను టీడీపీ నుంచి కాపాడుకుంటుంటే.. అసలు ఏ మాత్రం బలం లేని టీడీపీ ఎందుకు క్యాంపు పెట్టిందని ప్రశ్నించారు. ప్రలోభాలకు గురి చేసి కార్పొరేటర్లను భయపెట్టి, బెదిరించి వారి పక్షాన లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్ల కార్పొరేటర్లు అయిన ప్రతి ఒక్కరూ రేపు జరిగే ఎన్నికల్లో వారి అంతరాత్మ ప్రబోధించిన విధంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
● ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు పదే పదే విలువల గురించి మాట్లాడుతూ ఆయన పాటించడం లేదని విమర్శించారు. అసలు ఏ మాత్రం మెజారిటీ లేకుండా ఎన్నికల్లో నామినేషనుల ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్పష్టంగా వారికి అవకాశం లేదని తెలిసి, ఎన్నికల్లో నిలబడటమంటే..అక్రమం కాదా చంద్రబాబు ? అని మండిపడ్డారు. గుంటూరు కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి నీచ రాజకీయాలు జరగలేదని, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ఏ విధంగా చేర్చుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
● పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ అధికారం ఉందనే అహకారంతో టీడీపీ క్యాంపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నుంచి రక్షణ లేదు కాబట్టే...క్యాంపు నిర్వహించాల్సిన పరిస్థితి తమకు వచ్చిందని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇటువంటి చిన్న పదవుల కోసం రాజకీయాలు చేయటం సిగ్గుచేటని ఖండించారు. డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం వారి పార్టీ నుంచి గెలిచిన వారిని పక్కకు రమ్మని చెప్పాలని, వైఎస్సార్ సీపీ నుంచి కొనుగోలు చేసిన అంశం గురించి మాట్లాడి తన నిజాయతీ చాటుకోవాలని కోరారు. పవన్ కల్యాణ్ తన వద్ద ఉన్న ఇద్దరిని వెనక్కి పిలిస్తే.. ఆయన వద్ద విలువులు నేర్చుకుంటామని తెలిపారు. చంద్రబాబు అండ్ కో స్టాండింగ్ కమిటీపై వెచ్చించిన సమయం నగరాభివృద్ధికి కేటాయిస్తే బాగుటుందని సూచించారు.
● నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు గానూ వైఎస్సార్ సీపీకి పూర్తి మెజారిటీ ఉందని తెలిపారు. టీడీపీ, కూటమి నేతలు గెలుపు కోసం చేస్తున్న రాజకీయాలు, సంఖ్యా బలం లేకపోయినా వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరికాదని ఖండించారు.
వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment