ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి యన్.యస్.కె ఖాజావలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3,10,17,24, మార్చి 3వ తేదీల్లో కార్యక్రమం జరగదని ఆయన పేర్కొన్నారు. డివిజన్, మున్సిపాలిటీ, మండల స్థాయిలోనూ రద్దు చేసినట్లు తెలియజేశారు. ఈనెల 3వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులకు
సేఫ్టీ జాకెట్స్ వితరణ
తాడేపల్లి రూరల్: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ జాకెట్లను శనివారం గుంటూరు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ రామకృష్ణ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హెడ్ రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని సేఫ్టీ జాకెట్స్‌ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా లీలావతి
నగరంపాలెం: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోన్న సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి టి.లీలావతి పదోన్నతిపై కర్నూలు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీయ్యారు. రెండు రోజుల కిందట ఆమె బాధ్యతల నుంచి రిలీవయ్యారు. ఆమె స్థానంలో న్యాయసేవాధికారి సంస్థ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఒకటో సబ్ కోర్టు జడ్జి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు.
కృష్ణా నదిలో
చేప పిల్లలు విడుదల
తాడేపల్లి రూరల్: కృష్ణా నది ఎగువ ప్రాంతం పడవల రేవు వద్ద గుంటూరు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి. గాలిదేవుడు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్‌లో రెండు ఫారంల నుంచి సేకరించిన 7.20 లక్షల చేప పిల్లలను వదిలామని తెలిపారు. కార్యక్రమంలో తాడేపల్లి తహసీల్దార్ డి. సీతారామయ్య, మత్సశాఖ అధికారులు, సిబ్బంది, సొసైటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
మంగళగిరి కొండపై
అగ్ని ప్రమాదం
మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరి పట్టణ పరిధిలోని ఎగువ నరసింహస్వామి, గండాలయ స్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. అవి దిగువ ప్రాంతానికి కూడా వ్యాపిస్తుండడంతో నివాసితులు ఆందోళన చెందుతూ అధికారులకు ఫోన్లు చేశారు. సహజంగా ఎప్పుడూ చెలరేగే మంటలే కదా అంటూ నిర్లక్ష్యం వహించడంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. చివరకు రెండు గంటల అనంతరం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.
స్క్రీనింగ్ క్యాంపు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు, వయో వృద్ధులకు ఉపకరణాలు అందించేందుకు ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ క్యాంపులు వాయిదా వేసినట్లు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్. సువార్త శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరిగి క్యాంపులు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment