అధిక వడ్డీ ఆశ చూపి ఐపీ
శరీరంపై ఖద్దరు చొక్కా, రెండు చేతులకు వేళ్లనిండా ఉంగరాలు, మెడలో జిగేలుమనిపించే బంగారు చైన్లు, రూ.లక్షలు ఖరీదు చేసే కార్లు, రూ.కోట్ల విలువైన భవనాలు, హడావుడి చేసే వ్యాపారాలు.... ఇవి ఉంటే చాలు బ్యాంకుల కంటే ఇలాంటి వారే భద్రమని నమ్మేస్తున్నారు. బ్యాంకుల్లో వడ్డీల కంటే వీరి వద్దే అధికమని ఆశ పడుతున్నారు. అదిగో ఆ హోదా.. ఇక మన డబ్బులకు అదే ధీమా.. అని రూ.లక్షలకు లక్షలు వారి చేతుల్లో పెట్టేస్తున్నారు. వీరితోపాటు తమ బంధుమిత్రులనూ ఆ బడాబాబుల వలలోకి లాగేస్తున్నారు. ఆ బడాబాబుల వ్యాపారం అడ్డం తిరిగితే ఐపీ అంటూ జెండా ఎత్తేస్తున్నారు. అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి రూపాయి కూడబెట్టి అప్పులిచ్చిన వారు అమ్మో అంటూ గుండెలు బాదుకుంటున్నారు.
జాబితాలో ఇంకెందరో...?
ఇద్దరు ప్రముఖ వ్యాపారుల ఐపీ పెడుతున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మరో ఔషధ వ్యాపారి కూడా ఇదే బాట పడతారని సమాచారం. కొంతకాలంగా సకాలంలో వడ్డీలు కట్టకపోవడంతో అప్పులిచ్చిన వారి ఒత్తిడి మేరకు ఇటీవల బహుళ అంతస్తుల భవనాన్ని వారికి రాసి ఇచ్చారట. ఇతర రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. ఆస్తులు అమ్మి డబ్బులు కడతానని హామీ ఇచ్చినట్టు తెలియవచ్చింది. మరోవైపు నరసరావుపేట రూరల్ మండలం దొండపాడు గ్రామానికి చెందిన ఓ గొర్రెల వ్యాపారి రూ.2 కోట్లకు ఐపీ పెట్టడంతో బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నరససరావుపేటలో ఐపీల పరంపర ఆగుతుందా? లేదా? అనే చర్చ జోరుగా వినిపిస్తోంది.
నరసరావుపేట టౌన్: దేశంలో ఆర్థిక నేరాలను వివిధ రూపాల్లో చూస్తుంటాం. బ్యాంకులకు రుణాలు ఎగనామం పెట్టే వాళ్ల దగ్గర నుంచి చిన్న మొత్తాల్లో చీటీలు వసూలు చేసి జేబులకు చిల్లులు పెట్టే వారు, టెక్నాలజీ సాయంతో సైబర్ మోసాలకు పాల్పడే వారు కనిపిస్తుంటారు. అయితే, నరసరావుపేటలో మాత్రం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి నట్టేట ముంచుతున్నారు. గత ఆరు నెలల్లో ఈ తరహా మోసాలు ఒక్కొక్కటిగా బయట పడటంతో అప్పులిచ్చిన వారు గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా నరసరావుపేటలో ఇద్దరు బడా వ్యాపారులు ఐపీ పెడుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టడంతో కలకలం రేపింది. దానికి బలం చేకూర్చేవిధంగా చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే బడా వ్యాపారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కుటుంబంతో రెండు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. సుమారు రూ.150 కోట్ల వరకు జనం దగ్గర అప్పు, చీటిపాటల రూపంలో వసూల్ చేసినట్టు సమాచారం. అతనికి పట్టణంలో పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, విలువైన స్థలాలు ఉండటంతో అప్పు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవు అన్న ధీమాతో స్తోమతకు మించి వడ్డీలకు ఇచ్చారు. ప్రతినెలా సక్రమంగా వడ్డీ చెల్లిస్తుండటంతో బంధువులు, స్నేహితుల వద్ద నుంచి సైతం కొందరు అప్పులు ఇప్పించి వారిని రోడ్డుపైకి తెచ్చారు.
ఆడంబరాలే నమ్మకానికి పునాదులు
నరసరావుపేటలో ఐపీ పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యాపారులు మొదటి నుంచి నమ్మకంగా వ్యవహరించిన వారే. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి నగదు డిపాజిట్ చేసేకంటే తమ వద్ద అయితే ఎక్కువ వడ్డీ వస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ఇద్దరు వ్యాపారుల్లో ఒకరు రియల్ ఎస్టేట్‌తోపాటు పొగాకు వ్యాపారం చేసేవారు. వీటితోపాటు స్థిరాస్తులు ఉండటంతో అతని వద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా వ్యాపారం కొనసాగించి రూ.కోట్లలో ప్రజల వద్ద నుంచి నగదు వసూలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఆస్తులకంటే అప్పులే అధికంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఐపీ పెట్టేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇది ఇలా ఉండగా సదరు పొగాకు వ్యాపారి బాధితులు వాదన మరోలా ఉంది. అప్పులు తీసుకున్న డబ్బులతో ఇతర ప్రాంతాల్లో విలువైన అస్తులను బినామీ పేర్లతో కూడబెట్టుకొని వ్యాపారంలో నష్ట వచ్చిందన్న సాకు చూపుతూ తమకు ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాడని వాపోతున్నారు.
ష్యూరిటీ ఉండాలి ...
సంస్థలు, వ్యక్తుల వద్ద పెట్టుబడులు గానీ, వడ్డీ వ్యాపారాలు గానీ వంటి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన సంస్థల్లోనే పెట్టుబడులు, డిపాజిట్‌లు చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో వ్యక్తుల వద్ద నగదు భద్రపరచుకునే క్రమంలో వారి నుంచి ష్యూరిటీ తీసుకోవాలంటున్నారు.
దొరికిన కాడికి ప్రజల డబ్బు వసూలు నమ్మకంగా ఏళ్ల తరబడి వ్యాపారాలు రూ.కోట్లలో చీటీపాటల నిర్వహణ రూ.వందల కోట్లు వసూలు చేశాక ఐపీ నరసరావుపేటలో కొందరి తీరిది కలవరపాటుకు గురవుతున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment