ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించుకుంటున్న భక్తులు
ఐనవోలు: ఉగాది సమీపిస్తుండగా ప్రఖ్యాత ఐలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి వారాంతపు జాతరలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం ఒగ్గు పూజారుల మేలు కొలుపుతో మల్లన్న సన్నిధిలో సందడి ప్రారంభమైంది. స్వామి వారికి నిత్య కై ంకర్యాలు శైవ ఆగమ పద్ధతిలో నిర్వహించి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో స్వామి వారిని అభిషేకించారు. శనివారం సాయంత్రమే ఆలయానికి చేరుకున్న భక్తులు పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.
కొంతమంది భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించుకుని ఒగ్గు సంప్రదాయంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వారి పితృదేవతలను పూజించారు. బోనం వండి అమ్మవారికి సమర్పించి కోడెను కట్టి, శావ(రథం)లాగి మొక్కులు తీర్చుకోగా మరికొందరు వరం పట్టారు, వడి బియ్యం సమర్పించారు. టెంకాయ బందనం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణతో మార్మోగింది. భక్తుల రద్దీ అధికం కావడంతో ఎస్పై ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు లక్షమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
బోనాలు వండుతున్న మహిళలు
శావ(రథం) లాగుతున్న భక్తులు
మల్లన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment