శిశువును అపహరించిన మహిళ అరెస్టు
రామన్నపేట : ఆమె శిశువును దత్తత తీసుకోవాలనుకుంది.. కానీ కుదరలేదు. చివరికి ఎత్తుకెళ్లాలనుకుంది. శిశువును అపహరించి పోలీసులకు దొరికిపోయింది. వరంగల్ సీకేఎం ఆస్పత్రి నుంచి పసికందును అపహరించిన మహిళను ఇంతేజార్ గంజ్ పోలీసులు 24 గంటలలోపు అదుపులోకి తీసుకున్నారు. ఆమెనుంచి ఏడు నెలల మగశిశువును స్వాధీనం చేసుకుని సోమవారం రాత్రి వైద్యచికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా సార్కాని గ్రామానికి చెందిన జుగునకే సునీత నాలుగేళ్లుగా ఆదిలాబాద్ సుందరయ్యనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. భర్త సరిగా పట్టించుకోకపోవడంతో ఓ బాబుని దత్తత తీసుకోవాలని భావించింది. కానీ ఎలానో ఆమెకు తెలియలేదు. ఇక శిశువును అపహరించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వీలు కాకపోవడంతో వారం రోజుల క్రితం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ గోండుతెగ వారు కనిపించగా వారి భాషలో మాట్లాడి భీమ్‌బాయ్ అనే మహిళను పరిచయం చేసుకుంది. తన భార్య ఏడు నెలలకే మగబాబుని ప్రసవించిందని, అలా పుట్టడడంతో బాక్స్‌లో పెట్టారని భీమ్‌బాయ్ భర్త సదరు మహిళకు చెప్పాడు. ఎలాగైనా ఆ బాలుడిని ఎత్తుకెళ్లాలని అనుకున్న సునీత.. పథకం ప్రకారం.. బాబుకు సీరియస్‌గా ఉందని చెప్పి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని ఆ ఆస్పత్రి వైద్యులను నమ్మించింది. వరంగల్‌లో చిన్న పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తారని తెలిపి ఎంజీఎంకు తీసుకువచ్చింది. శిశువు తల్లిదండ్రులను బయటనే ఉంచి పాపను సునీత పేరుతో అడ్మిట్ చేయించింది. తరువాతరోజు శిశువు తండ్రి మేము బాబును తీసుకెళ్తాం.. ఇక్కడ చికిత్స అవసరం లేదని అనగా, సదరు మహిళ తెలివిగా బాబు సీరియస్‌గా ఉందని మరోమారు తల్లిదండ్రులను, స్థానిక వైద్యులను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ కూడా తల్లిదండ్రులను బయట ఉండమని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా శిశువును ఎత్తుకెళ్లింది. వరంగల్ రైల్వేస్టేషన్‌నుంచి నిజామాబాద్‌కు వెళ్లి అక్కడినుంచి తన సొంతూరు సార్కాని గ్రామానికి తీసుకెళ్లింది. సోమవారం ఊట్నూర్‌లో తన భర్త ఇంట్లో బట్టలు తీసుకెళ్లేందుకు ఆదిలాబాద్ బస్టాండ్‌కు రాగా పోలీసులు ఆ మహిళను పట్టుకుని వరంగల్‌కు తీసుకువచ్చి అరెస్టు చూపారు. 24 గంటల్లో కిలాడీ లేడీ అరెస్టు చేసిన ఇంతేజార్ గంజ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐ వెంకన్న, ఉపేందర్, మహేందర్‌లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
24 గంటల్లో నిందితురాలిని ఆదిలాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment