హన్మకొండ: ఉద్యోగి జీతం కట్ చేసే హక్కు ఉద్యోగ జేఏసీకి ఎక్కడిదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్లి రవి ప్రశ్నించారు. ఉద్యోగుల హక్కులు సాధించలేని, సమస్యలు పరిష్కరించలేని వారు ఉద్యోగుల ఒక రోజు మూలవేతనాన్ని సీఎం సహాయనిధికి ఎలా ఇస్తామని చెబుతారని ఆయన ఒక ప్రకటనలో నిలదీశారు. ఇతర ఉద్యోగ సంఘాలతో జిల్లాల వారీగా ఒక్క మీటింగ్ కూడా నిర్వహించకుండా, ఉద్యోగుల సలహాలు, అంగీకారం స్వీకరించకుడానే ఎలా మాటిస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న సీనియర్ సహాయకులు, గిర్దావర్‌లు, జూనియర్ సహాయకులు, టైపిస్ట్‌లు, స్టెనో కం టైపిస్ట్‌లు, ప్రభుత్వ డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, చైన్‌మెన్‌లు, ఆఫీస్ సబార్డినేట్‌లు, వాచ్‌మెన్‌లున్న అతి పెద్ద సంఘం తమదన్నారు. ఇంత పెద్ద సంఘంతో సంప్రదించకుండా సీఎం సహాయనిధికి రూ.100 కోట్లు ఇస్తామని ఒక జేఏసీ నాయకుడు, రూ.130 కోట్లు ఇస్తామని మరో జేఏసీ నాయకుడు పోటీపడి చెబుతున్నారన్నారు. సహాయం ప్రకటించే ముందు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల అభిప్రాయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ జేఏసీ నాయకులు ఉద్యోగుల హక్కుల గురించి ఎందుకు అడగడం లేదని, ఇంత వరకు పీఆర్‌సీ సాధించలేదని, 5 డీఏలు ఇప్పించలేదని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువగా 5 శాతం ఐఆర్ ఏనాడు ఇవ్వలేదని, ఈ–కుబేర్‌లో పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదని తూర్పారబట్టారు. తమవి గొప్ప సంఘాలు అన్ని చెప్పుకుంటున్న నాయకులు ఆ సంఘాల సభ్యుల నుంచి జీతం కట్ చేసుకుని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని, తమ సంఘంలోని సభ్యుల జీతాలు తాము కట్ చేసుకుని సీఎం సహాయ నిధికి చెల్లిస్తామన్నారు. తమ సంఘం వంద శాతం ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిందని, ఇక ముందు కూడా పని చేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి
Comments
Please login to add a commentAdd a comment