గాయంతో పతకం కోల్పోయా..
● అంతర్జాతీయ క్రీడాకారిణి అరుణ ● ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆటల ఉత్సవం
వరంగల్ స్పోర్ట్స్: వరుసగా ఐదు పర్యాయాలు ప్రపంచ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొన్నా.. ప్రతిసారి కాలుకు గాయం కావడంతో పతకాలు సాధించలేకపోయానని అంతర్జాతీయ క్రీడాకారిణి అరుణ బుద్దారెడ్డి అన్నారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం గ్రామీణ ఆటల ఉత్సవం నిర్వహించారు. పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ క్రీడల్లో నిర్వహించిన పోటీలకు అరుణ బుద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. 2018లో మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి పాల్గొని టేబుల్ వాక్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. 2019 నుంచి 2023 వరకు వివిధ దేశాల్లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రతీసారి కాలుకు తీవ్రగాయం కావడంతో లక్ష్యం చేరుకోలేకపోయానన్నారు. ఈశా ఫౌండేషన్ వలంటీర్ శిరీష మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 22 వాలీబాల్ జట్లు, 12 త్రోబాల్ జట్లు పాల్గొన్నాయన్నారు. వాలీబాల్‌లో పడిగాపూర్ గెలుపొందగా రన్నరప్‌గా నీరుకుళ్ల నిలిచిందని తెలిపారు. త్రోబాల్‌లో కమలాపూర్ గెలుపొందగా, రన్నరప్‌గా శాయంపేట నిలిచిందన్నారు. డిసెంబర్ 28న సద్గురు సమక్షంలో కోయంబత్తూర్ లోని ఆదియోగి స్టేడియంలో ఫైనల్ జరుగుతుందని తెలిపారు. ముగింపు వేడుకలకు ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి హాజరై వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టుకు రూ. పదివేల నగదు ప్రోత్సాహకం అందజేశారు. కార్యక్రమంలో ఈశా ఫౌండేషన వలంటీర్లు వేణుగోపాల్, రమాకాంత్, సింధు, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర క్యావర్గ సభ్యుడు శ్రీధర్, అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment