కాడెద్దుకు కన్నీటి వీడ్కోలు..
కేసముద్రం: ఎడ్లజతే ఆ రైతుకు జీవనాధారం. ట్రాక్టర్లతో పొలం దున్నిస్తున్న ఈ కాలంలో ఆ జత ఎడ్లతో ఐదు ఎకరాలు సాగు చేశాడు. అందులో ఓ ఎద్దు చనిపోగా, కుటుంబ సభ్యుల మాదిరి దానికి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అనుగుల నర్సయ్య, నిర్మల రైతు దంపతులకు రెండు కాడెడ్లు ఉన్నాయి. తమకున్న రెండెకరాల్లో వరి పంట వేయగా, 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. శనివారం ఆ భూమిలో మొక్కజొన్న సాగు చేసేందుకు కాడెడ్లతో దున్ని విత్తనాలు వేశారు. మధ్యాహ్న సమయంలో కాడెడ్లను వ్యవసాయబావి సమీపంలోని గడ్డివాము వద్ద ఉన్న చెట్టుకు కట్టేశారు. అందులో ఓ ఎద్దు తాడు తెంపుకుని పచ్చిగడ్డి మేస్తూ బావివద్దకు వెళ్లి జారి అందులో పడింది. మెడకు ఉన్న తాడు బిగుసుకుని మృత్యువాతపడింది. కొద్దిసేపటి తరువాత రైతు దంపతులు అక్కడికి రాగా, అప్పటికే బావిలో పడి మృత్యువాత పడిన దృశ్యం చూసి బోరున విలపించారు. నాలుగేళ్లుగా సాకుతున్న ఎద్దు చనిపోవడంతో మనిషి మాదిరి అంత్యక్రియలు (ఖననం) జరిపి కన్నీటి వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment