రెండు కిలో మీటర్లు.. మూడున్నర గంటలు
హన్మకొండ: రెండు కిలో మీటర్లు.. మూడున్నర గంటలు.. హనుమకొండలో నిర్వహించిన లక్ష డప్పులు, వేల గొంతుకుల సన్నాహక మహాప్రదర్శన ఉత్తేజం నింపింది. సోమవారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు, కళాకారులు పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12.30 గంటలకు మహా ప్రదర్శన ప్రారంభించారు. వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం మూడున్నర గంటల పాటు మహాప్రదర్శన సాగింది. దారి పొడుగున మంద కృష్ణతోపాటు, ఆయా పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కళాకారులు తరలివచ్చిన డప్పులు వాయిస్తూ, పాడుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ, నాయకులు, కళాకారులు.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ శ్రేణులతోపాటు మాదిగ జాతిలో స్ఫూర్తి నింపింది. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే లక్ష డప్పులు.. వేల గొంతుల మహా ప్రదర్శనకు కార్యోణ్ముకులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 30 వేలకు పైగా తరలివెళ్లినున్నట్లు వక్తలు చెప్పారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణను అడ్డుకుంటున్న వివేక్ కుటుంబాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డపై ఉందన్నారు. ధర్మం, న్యాయం, సమాజం, పార్టీలు, ప్రధాన మంత్రితో సహా మాదిగల పక్షాన, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటే ఆయనను శత్రువుగా చూడమన్నారు. అయితే వర్ధన్నపేట ఎమ్మెల్యేతో సహా మాల ఎమ్మెల్యేలు, ఎంపీలను చిత్తుగా ఓడిస్తామన్నారు. ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమానికి ప్రతీ మాదిగ తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్, ఆయా పార్టీలు, ఆయా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు గోనె ప్రకాశ్ రావు, పృథ్వీరాజ్, నమిండ్ల శ్రీనివాస్, గిద్దె రాంనర్సయ్య, గంగ, వరంగల్ శ్రీనివాస్, ఏపూరి సోమన్న, దరువు ఎల్లన్న, రాంబాబు, అమూల్య, నలిగంటి శరత్, సయ్యద్ ఇస్మాయిల్, మాట్ల తిరుపతి, బుర్ర సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
మాదిగల్లో ఉత్తేజం నింపిన మహాప్రదర్శన
డప్పు చప్పుళ్లు, పాటలతో
కదం తొక్కిన కార్యకర్తలు
వర్గీకరణను అడ్డుకుంటున్న వారిని
ఎదుర్కోవాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ
వేయిస్తంభాల ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్ : ప్రదర్శనకంటే ముందుగా వేయిస్తంభాల దేవాలయాన్ని మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, గాయకుడు మిట్టపల్లి సురేందర్ తదితరులు సందర్శించారు. రుద్రేశ్వర స్వామి వద్ద డప్పులు ఉంచి పూజలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి మనసు కరిగి ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే శాసన సభలో ఆమోదించేలా రుద్రేశ్వరుడు కరుణించాలని తాము కోరుకున్నామని తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు ఉపేంద్రశర్మ వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి మహాదాశీర్వచనం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment