ఏసీబీ చేతికి అక్రమార్కుల చిట్టా! | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ చేతికి అక్రమార్కుల చిట్టా!

Published Sun, Feb 9 2025 1:23 AM | Last Updated on Sun, Feb 9 2025 1:23 AM

ఏసీబీ చేతికి అక్రమార్కుల చిట్టా!

ఏసీబీ చేతికి అక్రమార్కుల చిట్టా!

సాక్షిప్రతినిధి, వరంగల్‌: అవినీతికి పాల్పడుతూ.. అక్రమాస్తులు కూడబెడ్తున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. ఇంటలిజె న్స్‌, ఇతర నిఘా వర్గాల ద్వారా ఏసీబీ అధికారుల చేతికి అవినీతి అధికారుల చిట్టా అందినట్లు సమాచారం. అందులో పోలీసు, రెవెన్యూ, రవాణా, రిజిస్ట్రేషన్‌ తదితర శాఖలకు చెందిన కొందరు ఉన్నతాధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల పేర్లున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆదా యానికి మించిన ఆస్తుల కేసులో రవాణాశాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.

వరుస దాడులతో దడ..

ఏసీబీ దూకుడు అవినీతి, అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. 2021లో తొమ్మిది మంది ఉన్నతాధికారులు పట్టుబడగా, 2022లో 12, 2023లో 14 మంది ఏసీబీకి చిక్కారు. 2024 డిసెంబర్‌ నాటికి 16 కేసుల్లో 19 మంది వరకు పట్టుబడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ ఇంజినీరింగ్‌, రిజిస్ట్రేషన్‌, రవాణా శాఖల వారు ఎక్కువగా ఉన్నారు. 2024 కేసులు పరిశీలిస్తే జనవరి 5న విద్యాశాఖ(కాకతీయ యూ నివర్సిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(ఆడిట్‌ విభాగం) సిగసారపు కిష్టయ్యపై ఏసీబీ దాడులు నిర్వహించింది. జనవరి 11న ఓ ఫార్మసిస్టు నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా జనగామ డీఎంహెచ్‌ఓ, జూనియర్‌ అసిస్టెంట్‌లను పట్టుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. మార్చి 4న తొర్రూరు అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ అక్రమాస్తులపై దాడులు నిర్వహించిన ఏసీబీ.. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం మార్చి 22న రూ.19,200 మహబూబాబాద్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ తస్లీమా మహమ్మద్‌ను పట్టుకుంది. కేసు ఎత్తివేసేందుకు ఆర్టీసీ డ్రైవర్‌ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏప్రిల్‌ 15న హుజూరాబాద్‌ డీఎం హన్మకొండలో ఏసీబీకి చిక్కారు. కమలా పూర్‌ మండల కన్నూరుకు చెందిన ఓ రైతు నుంచి వ్యవసాయ భూమి గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఏసీబీ దూకుడు పెంచింది. జనవరి 6న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన కర్రి జగదీష్‌.. రేషన్‌ బియ్యం లారీని విడిచిపెట్టినందుకు రూ.4 లక్షల డిమాండ్‌ చేసి.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. తాజాగా శుక్రవారం రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.. అతడిని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఆ నాలుగు శాఖలపైనే గురి..

ఉమ్మడి వరంగల్‌లో ఇటీవల జరిగిన ఏసీబీ దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖలపైన దృష్టి సారించి నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు సంబంధించిన పలు జిల్లా కార్యాలయాలపై ఏసీబీ సోదాలు నిర్వహించి పలువురిపై చర్యలకు సిఫారసు చేసింది. వరంగల్‌, హనుమకొండ, మహబూబా బాద్‌ రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. అలాగే పోలీసుశాఖలో కొందరు ఎస్సై నుంచి ఏసీపీ స్థాయి అధికారులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. అక్రమార్జన లక్ష్యంగా కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకోవడానికి అధికారుల కేడర్‌ను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు చేసినట్లు జరిగిన ప్రచారం పోలీసుశాఖలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఇదిలా ఉండగా.. రవాణాశాఖలో ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పిస్తున్నారు. వరంగల్‌ జిల్లా రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) గంధం లక్ష్మి ని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన అధికారులు శనివారం ఆమె స్థానంలో సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.శోభన్‌బాబుకు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖలో ఇటీవల పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఆ శాఖపైన దృష్టి పెట్టింది. ఉమ్మడి వరంగల్‌లో 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. కాజీపేట, వరంగల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఇటీవల ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం, అవకతవకల గురించి ఆరాతీయడంపై చర్చ జరుగుతోంది.

పోలీస్‌, రవాణా, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలపై నజర్‌

అవినీతి అధికారులపై ప్రభుత్వానికి

ఇంటలిజెన్స్‌ నివేదికలు

పుప్పాల శ్రీనివాస్‌ ఘటనతో

అక్రమార్కుల గుండెల్లో రైళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement