హైదరాబాద్: ఏపీలోని కడప సమీపంలో చెన్నూరు హైవేౖపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లోని ఇంజినీర్ కాసెల్‌లో హన్నె పద్మావతి (60) నివాసముంటున్నారు.
ఆమె కూతురు కొండేటి విజయరాణి (35), అల్లుడు కొండేటి కృష్ణ (43), మనవడు రుషి (14), మనవరాలు నిహారిక (18)లు ఆనంద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం కొండేటి కృష్ణ తండ్రి మరణించడంతో అంత్యక్రియల కోసం తిరుపతిలోని బైరాగి పట్డేడకు పద్మావతి సహా అయిదుగురు కారులో బయల్దేరారు. శనివారం అంత్యక్రియలకు హాజరైన తర్వాత ఆదివారం ఉదయం తిరిగి నగరానికి బయల్దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు కడప దాటి చెన్నూరు సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన కృష్ణ, రుషి కడప రిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. విజయరాణి, నిహారికలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృత్యు ముఖం నుంచి అప్పుడు బయటపడినా..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం ఈ కుటుంబ సభ్యులు యాదాద్రి వెళ్లి తిరిగి నగరానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ.. ఆదివారం మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను బలిగొనడంతో మృతుల బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పద్మావతి కుమారుడు మున్నా కుమార్ లండన్‌లో ఉన్నత చదువుల కోసం ఇటీవల వెళ్లాడు. తల్లి మరణ వార్తతో సోమవారం తిరిగి వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మావతి తాను నివసించే అపార్ట్‌మెంట్‌కు సెక్రటరీగా ఉన్నారు. అందరితోనూ ఆమె కలుపుగోలుగా ఉండేవారని అపార్ట్‌మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment