డిసెంబర్‌లో చర్లపల్లి టెర్మినల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో చర్లపల్లి టెర్మినల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Nov 29 2024 6:13 AM | Last Updated on Fri, Nov 29 2024 6:41 PM

డిసెంబర్‌లో చర్లపల్లి టెర్మినల్‌కుర గీన్‌ సిగ్నల్‌

డిసెంబర్‌లో చర్లపల్లి టెర్మినల్‌కుర గీన్‌ సిగ్నల్‌

తొలుత ఈ నెల 30న ముహూర్తం

సాంకేతిక కారణాలతో వాయిదా

వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభానికి సన్నాహాలు

ముఖ్య అతిథిగా హాజరు కానున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగో టెర్మినల్‌గా సేవలందించే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ డిసెంబర్‌ మొదటి వారంలో అందుబాటులోకి రానుంది. ఈ నెల 30వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు గురువారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. డిసెంబర్‌లో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు.

ఎయిర్‌పోర్టు తరహాలో..

పర్యావరణ హితమైన ప్రమాణాలతో, ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలతో చర్లపల్లి టెర్మినల్‌ను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.430 కోట్లతో స్టేషన్‌ను విస్తరించారు. చర్లపల్లి టెర్మినల్‌ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపైన ఒత్తిడి తగ్గనుంది. స్టేషన్‌ ప్రారంభోత్సవం అనంతరం దశలవారీగా రైళ్ల రాకపోకలను అందుబాటులోకి తేనున్నారు. చర్లపల్లి నుంచి 25 జతల రైళ్లు నడవనున్నాయి. ప్రతిరోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేసే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఔటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా నేరుగా చర్లపల్లికి రాకపోకలు సాగించవచ్చు. మరోవైపు సికింద్రాబాద్‌ పునరభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్న దృష్ట్యా చర్లపల్లిని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది.

అధునాతన సదుపాయాలు..

చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌, వెయిటింగ్‌ హాళ్లు, స్లీపింగ్‌ పాడ్‌లు, కెఫెటేరియాలు, రెస్టారెంట్లు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, ఈవీ చార్జింగ్‌ పాయింట్లు తదితర సదుపాయాలన్నీ ఉంటాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 చెట్లను ట్రాన్స్‌లొకేట్‌ చేశారు. వర్షపు నీటినిల్వ కోసం పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలను నిర్మించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్‌ ప్యానెళ్లు, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. విమానాశ్రయాన్ని తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. టెర్మినల్‌ గోడలపై ఏర్పాటు చేసిన కళాత్మక చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. దక్షిణమధ్య రైల్వే చరిత్రను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఎన్నో చిత్రాలను ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేశారు.

చర్లపల్లి టెర్మినల్‌ ప్రత్యేకతలివీ..

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నాలుగో అతిపెద్ద స్టేషన్‌గా అవతరించనుంది.

ప్రతిరోజూ 25 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 50 వేల మంది ప్రయాణికులకు పైగా స్టేషన్‌ సేవలను వినియోగించుకుంటారు.

చర్లపల్లి టెర్మినల్‌లో 9 ప్లాట్‌ఫాంలు, 2 పాదచారుల వంతెనలు, 5 ఎస్కలేటర్లు, 5 లిఫ్టులు ఏర్పాటు చేశారు.

అన్ని వైపుల నుంచి ప్రయాణికులు ఔటర్‌మీదుగా రాకపోకలు సాగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement