No Headline
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులు
అసహాయులకు కరువైన వసతి
రాత్రిపూట ఫుత్‌పాత్‌లపై గజగజ
మంచుతో వణుకుతున్న నిరాశ్రయులు
నగరంలో వందలాది మంది నరకయాతన
స్పందించని ప్రభుత్వం, అధికారులు
హైదరాబాద్: ఇళ్లల్లో ఉంటున్నవారే ప్రస్తుతం చలికి గజగజ వణుకుతూ బతుకు దేవుడా అనుకుంటూ బిర్రబిగిసిపోతున్నారు. మరి రాత్రిపూట ఫుట్‌పాత్‌లపై నిద్రించే నిరాశ్రయుల గతి ఏమిటి? వారి దయనీయ పరిస్థితి చూస్తే గుండెలు ద్రవించాల్సిందే! రోజు రోజుకూ చలిపులి పంజా విసరడం తీవ్రతరమవుతోంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి గజగజ వణికిస్తుండటంతో నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై నిద్రించే నిరాశ్రయులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ముందు వందలాది మంది నరకయాతన అనుభవిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు లేక.. తలదాచుకోవడానికి వసతి కానరాక మంచులోనే వణుకుతూ రాత్రంతా కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా.. వందలాది మంది ఇక్కడి ఫుట్‌పాత్‌లపై.. సెంట్రల్ మీడియన్లు.. ఖాళీ స్థలాలు, బండల మీద.. కేబీఆర్ పార్కు వాక్ వేలో.. బహిరంగ ప్రదేశాల్లో నిద్రకుపక్రమిస్తున్నారు. కానీ.. అటు ప్రభుత్వం.. ఇటు యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదు. అభాగ్యులకు అండగా ఉండేందుకు ముందుకు రావడంలేదు.
బెడ్ షీట్ల పంపిణీ మరిచిపోయారు..
ప్రతియేటా ఈ దుస్థితి ఉన్నా జీహెచ్‌ఎంసీ ఏమాత్రం చర్యలు తీసుకుంటున్న పాపానపోవడం లేదు. గతంలో చలికాలం వచ్చిందంటే ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న నిరాశ్రయులకు జీహెచ్‌ఎంసీ బెడ్‌షీట్లను పంపిణీ చేసేది. గత నాలుగైదు ఏళ్లుగా జీహెచ్‌ఎంసీ అనాథలపై ఏమాత్రం మానవత్వం చూపడం లేదు. ఎవరైనా దాతలు దుప్పట్లు ఇస్తే కప్పుకోవడం, లేదంటే వణుకుతూ పడుకోవడం వీరందరికీ అలవాటైపోయింది. ఒక్క బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ముందే 300 మందికి పైగా నిరాశ్రయులు ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు.
సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి దగ్గరలో, మంత్రుల క్వార్టర్లకు కూతవేటు దూరంలో, నిత్యం జీహెచ్‌ఎంసీ అధికారులు రాకపోకలు సాగించే ఈ రహదారిలోనే ఇంతటి దుస్థితి నెలకొందంటే నమ్మ శక్యం కాదు. కానీ.. ఇది కఠిన వాస్తవ దృశ్యం.
కోట్లాది రూపాయలు ఎటు పోతున్నట్లు..?
నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లపై జీహెచ్‌ఎంసీ ప్రతియేటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తోంది. వీరంతా ఫుట్‌పాత్‌లపై ఉంటే షెల్టర్లలో ఖర్చులు ఎవరి పేర్లపై రాస్తున్నారని ప్రశ్నార్థకంగా మారింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, రెయిన్‌బో ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, పంజగుట్ట చౌరస్తా, ఖైరతాబాద్ చౌరస్తా, విరించి చౌరస్తా, సాగర్ సొసైటీ చౌరస్తా, ఇందిరానగర్, శ్రీకృష్ణానగర్ ఇలా.. నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో వందలాది మంది నిరాశ్రయులు ఇలా ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment