మళ్లీ.. ‘మూసీ’ అలజడి!
సాక్షి, సిటీబ్యూరో: మూసీ పరీవాహక పరిధిలో మళ్లీ అలజడి రగులుకుంటోంది. హైకోర్టు తీర్పుతో నివాసాల కూల్చివేతలు తప్పవన్న సాంకేతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఉన్నతస్థాయి ఆదేశాలు అందగానే రంగంలోకి దిగేలా రెవెన్యూ యంత్రాంగం కార్యాచరణకు సిద్ధమవుతోంది. మూసీ రివర్‌బెడ్, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ జోన్లలోని నిర్మాణాలను తొలగించే సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడటంతో పకడ్బందీగా అడుగులేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తొలుత గుర్తించిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి రంగంలోకి దిగాలని భావిసోంది. మూసీ పునరుజ్జీవ పథకం ఫేజ్–1లో నార్సింగి నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున, ఫేజ్–2 ప్రాజెక్టు నాగోల్ తట్టిఅన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. తొలి ఫేజ్‌లో భారీగా నిర్మాణాలు ఉండగా, రెండో ఫేజ్‌లో మాత్రం పెద్దగా ఆక్రమణలు లేనట్లు తెలుస్తోంది.
తాత్కాలికంగా ఆగినా..
● మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరీవాహక పరిధిలోని నివాసాల తొలగింపు వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకతతో రెవెన్యూ యంత్రాంగం వెనక్కి తగ్గినా.. హైకోర్టు తీర్పుతో తిరిగి కదలిక వచ్చినట్లయింది. గత నెలలో నదీ గర్భం, బఫర్ జోన్‌లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే నిర్మాణాలు తొలగింపునకు ముందడుగు వేయాలని నిర్ణయించగా, కొందరు కోర్టును ఆశ్రయించడంతో తీర్పు ప్రభుత్వానికి మరింత కలిసి వచ్చినట్లయింది.
● వాస్తవంగా మూసీ పక్షాళన కోసం తొలి అడుగులోనే హంసపాదు ఎదురైంది. నదీ పరీవాహక పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్‌మార్కింగ్ వేసే ప్రయత్నమే బెడిసికొట్టాయి. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకావడంతో, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. నిర్వాసితులకు రాజకీయ పక్షాల మద్దతు మరింత కలిసి రావడంతో ఆందోళనలు ఉద్ధృతమైంది. దీంతో నదీ గర్భంలో రెడ్ మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో తాత్కాలికంగా ప్రక్రియ ఆగిపోయింది.
12 వేలకుపైగా ఆక్రమణలు
మూసీ పరీవాహక పరిధిలో 12,184కి పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీ గర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీ గర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా.. 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు బఫర్‌జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు ఉండగా.. 1,032 భారీ నిర్మాణాలున్నట్లు అఽధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది.
ఇక ముందస్తు నోటీసులు
మూసీ పక్షాళనలో భాగంగా రివర్‌బెడ్, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న ఆక్రమణదారులకు ముందస్తు నోటీసులు జారీ కానున్నాయి. చట్టబద్ధంగా అక్రమ నిర్మాణాలున తొలగించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించనున్నారు. నిర్వాసితులకు సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా పునరావాసం కల్పించనున్నారు. ఎక్కడైనా పట్టా, శిఖం పట్టా భూములు ఉంటే తగిన పరిహారం చెల్లించి వాటిని భూసేకరణ ద్వారా స్వీకరిస్తారు.. బిల్డింగ్స్ రూల్స్ – 2012ను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ అథారిటీలు, సంస్థలు నిర్వహించే సర్వేను, హద్దుల గుర్తింపు ప్రక్రియను అడ్డుకుంటే ఆందోళనకారులపై చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment