చక్కర్లు కొట్టి.. చెట్టుకు ఢీకొట్టి | - | Sakshi
Sakshi News home page

చక్కర్లు కొట్టి.. చెట్టుకు ఢీకొట్టి

Published Sat, Nov 2 2024 7:51 AM | Last Updated on Sat, Nov 2 2024 7:51 AM

చక్కర

చక్కర్లు కొట్టి.. చెట్టుకు ఢీకొట్టి

డివైడర్‌పైకి ఎక్కి.. కేబీఆర్‌ పార్కు ఫెన్సింగ్‌ను దాటుకుని..

చాసిస్‌ నంబర్‌ ఆధారంగా గుర్తించిన పోలీసులు..

ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు నుజ్జునుజ్జయిన నంబర్‌ ప్లేట్‌ లేని పోర్షే ఎలక్ట్రానిక్‌ కారు చాసిస్‌ నంబర్‌ ఆధారంగా దాని నంబర్‌ను గుర్తించారు. ఉత్సవ్‌ మామ పర్వత్‌ శ్రీనివాస్‌రెడ్డి పేరుపై కారు రిజస్ట్రేషన్‌ అయి ఉంది. అల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తేలింది. ఈ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఉత్సవ్‌ను ఎస్‌ఆర్‌ నగర్‌లో శుక్రవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా జీరో వచ్చింది. రక్త నమూనాలు సేకరించారు. భయంతోనే తాను పారిపోయినట్లు అతడు పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్సవ్‌ దీక్షిత్‌ రాత్రంతా ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరెవరి దగ్గరకు వెళ్లాడు, ఎక్కడైనా మద్యం తాగాడా? ఇతర విందుల్లో పాల్గొన్నాడా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కారుకు మరమ్మతు అవసరముందని, గ్యారేజీకి తీసుకురావాలని షోరూం నిర్వాహకులు రెండు నెలల క్రితమే చెప్పగా.. పట్టించుకోకుండా ఉత్సవ్‌ అందులోనే తిరిగినట్లు తెలిసింది.

మితిమీరిన వేగంతో కారు నడిపిన యువకుడు

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రాణాలతో బయటపడిన యువ వ్యాపారి

విచారణ జరుపుతున్న పోలీసులు

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడికి గాయాలయ్యాయి. డివైడర్‌పై నుంచి వెళ్లి.. ఫెన్సింగ్‌ను ఢీకొని, చెట్టును ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. అదుపుతప్పిన వేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎడమ వైపు ముందటి టైర్‌ ఊడిపోయి 50 మీటర్ల దూరం వెళ్లి పడిపోవడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. బెలూన్లు తెరుచుకోవడంతో కారు నడుపుతున్న యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–6లో నివసించే ఉత్సవ్‌ దీక్షిత్‌ (33) ప్లాస్టిక్‌ వ్యాపారం చేస్తుంటాడు. గురువారం రాత్రి భార్యతో గొడవ పడి రూ.3 కోట్ల విలువ చేసే నంబర్‌ ప్లేట్‌ లేని పోర్షే కారులో బయటకు వచ్చాడు. ఫిలింనగర్‌లో రాత్రి 11 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాడు. దీపావళి సందర్భంగా తన స్నేహితులకు స్వీట్‌ బాక్సులు ఇచ్చి తెల్లవారుజాము వరకూ కారులో అతివేగంగా చక్కర్లు కొడుతూ గడిపాడు.

కారు స్టీరింగ్‌కు లాక్‌ పడటంతో..

శుక్రవారం తెల్లవారుజామున నగరమంతా చక్కర్లు కొట్టి 5 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–12లోని అగ్రసేన్‌ చౌరస్తా, తెలంగాణ భవన్‌ మీదుగా కారులో దూసుకొచ్చాడు. మితిమీరిన స్పీడ్‌తో వస్తుండగా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సమీపంలో తెలంగాణ భవన్‌ యూ టర్న్‌ వద్ద స్టీరింగ్‌కు లాక్‌ పడింది. దీంతో రైట్‌కు కట్‌ చేస్తుండగా స్టీరింగ్‌కు లాక్‌ పడడంతో ఎడమ వైపు టర్న్‌ అయ్యింది. ఇదే స్పీడ్‌లో కారు డివైడర్‌ను ఢీకొని.. దానిపైకెక్కి కేబీఆర్‌ పార్కు ఫెన్సింగ్‌పై నుంచి దూసుకెళ్లి ఓ చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. ముందు టైర్‌ ఊడి పడిపోవడంతో పాటు ఫుట్‌పాత్‌ ధ్వంసమై, ఫెన్సింగ్‌ ఊడిపోయి పార్కు లోపల పడింది. అదృష్టవశాత్తూ భారీ చెట్టు అడ్డుగా ఉండడంతో ప్రమాదం తప్పింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఉత్సవ్‌ దీక్షిత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదే ఫుట్‌పాత్‌పై పడుకున్న యాచకులు, నిరాశ్రయులు, బసవతారకం ఆస్పత్రి రోగుల సహాయకులు ప్రమాద ధాటికి భారీ శబ్దాలతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కారులోంచి బయటపడ్డ ఉత్సవ్‌ దానిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
చక్కర్లు కొట్టి.. చెట్టుకు ఢీకొట్టి 1
1/1

చక్కర్లు కొట్టి.. చెట్టుకు ఢీకొట్టి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement