కమ్మేసిన కాలుష్యం
గ్రేటర్‌లో దీపావళికి టపాసుల మోత
● పరిమితికి మించి శబ్ద, వాయు పొల్యూషన్
● భారీస్థాయిలో దిగజారిన గాలి నాణ్యత
● కాప్రా, జూపార్క్, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్‌లలో అధిక ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కాలుష్యం కమ్ముకుంది. పర్యావరణహితంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు, పోలీసులు సూచించినా ఫలితం కనిపించలేదు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో టపాసుల మోత మోగడంతో తీవ్రమైన శబ్ద కాలుష్యంతో పాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ అలుముకుంది. ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది.
ప్రమాదకర స్థాయికి..
దీపావళి సందర్భంగా గురువారం రాత్రి పలుచోట్ల ప్రజలు టపాసులు పేల్చారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రకారం కాప్రా, జూపార్క్, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్ ప్రాంతాలలో అధిక వాయు కాలుష్యం వెదజల్లింది. దీంతో గాలి నాణ్యత (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి దిగజారింది. రాత్రి 10 గంటల సమయంలో గ్రేటర్‌లోని వాతావరణంలో పర్టిక్యులర్ మ్యాటర్ (పీఎం)–2.5 ప్రమాదకర స్థాయిలో చేరుకుంది. పీఎం–10 సూక్ష్మ ధూళికణాలు, పీఎం–2.5 (అతి సూక్ష్మధూళి కణాలు), ఓజోన్, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్‌డయాకై ్సడ్, వంటి పలు కాలుష్య కారకాలు వెలువడ్డాయి.
ఈ ప్రాంతాల్లో గరిష్టంగా..
పీసీబీ పరిమితుల ప్రకారం పీఎం–2.5 తీవ్రత 40 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ.. గురువారం రాత్రి గరిష్టంగా సనత్‌నగర్‌లో 472 మైక్రోగ్రాములు, కాప్రాలో 454లతో పాటు జూపార్క్, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్‌ల లో గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. రామచంద్రాపురంలో పీఎం–10 మోతాదు అత్యధికంగా 605 మైక్రోగ్రాములుగా నమోదయింది.
శబ్ద కాలుష్యం సైతం..
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నివాస సమయాల్లో 55 డెసిబుల్స్ (డీబీ), వాణిజ్య ప్రాంతాల్లో 55 డీబీ, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 డీబీ, సున్నితమైన ప్రాంతాల్లో 40 డీబీలుగా పీసీబీ నిర్దేశించింది. కానీ.. దీపావళి రోజున అన్ని ప్రాంతాల్లోనూ పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడిందని పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నివాస, వాణిజ్య ప్రాంతాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లోనూ విపరీతమైన ధ్వని కాలుష్యం వెలువడింది. జూబ్లీహిల్స్, సనగర్‌నగర్, కొంపల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్, జూపార్క్ వంటి ప్రాంతాల్లో టపాసుల మోతతో పరిమితికి మించి శబ్ద కాలుష్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment