తెలంగాణ స్పైస్.. క్రిమినల్ కేస్
బంజారాహిల్స్: నిర్లక్ష్యంగా వ్యవహరించి గ్యాస్ లీకేజీ, పేలుళ్లకు కారణమైన తెలంగాణ స్పైస్ కిచెన్ యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1లో ఉన్న తెలంగాణ స్పైస్ కిచెన్ అండ్ బార్‌లో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ లీకై భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి. ఈ ధాటికి గోడ కుప్పకూలి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీ ఇళ్లపై పడింది. ఈ ఘటనలో పది ఇళ్లు ధ్వంసం కాగా పూజ అనే మహిళకు గాయాలయ్యాయి. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ స్పైస్ కిచెన్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1లో ఆదివారం ఉదయం పేలుడు జరిగిన తెలంగాణ స్పైస్ కిచెన్‌ను క్షేత్ర స్థాయిలో సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. పేలుడు ధాటికి హోటల్ వెనుక భాగంలో ఉన్న గదులు, ప్రహరీ కూలి రాళ్లు, ఇనుపరాడ్లు, రేకులు, వంద మీటర్ల వరకు ఎగిరిపడడంతో పేలుళ్ల తీవ్రతను పరిశీలించి కారణాలను తెలుసుకున్నారు. హైడ్రా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, జిల్లా ఫైర్ ఆఫీసర్ మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మోహన్‌రావులతోపాటు పలువురు అధికారులు రంగనాథ్ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment