శబరిమల.. చేరేదెలా!
ఇప్పటివరకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుపై దృష్టి సారించని రైల్వే
సాక్షి, సిటీబ్యూరో: శబరిమల.. అయ్యప్ప సన్నిధి.. హైదరాబాద్ నుంచి అయ్యప్ప సన్నిధికి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే శరణ్యం. కానీ, అందులో ఇప్పటికే ‘నో బెర్త్’దర్శనమిస్తోంది. హైదరాబాద్ మీదుగా శబరిమల వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. అన్నింటిలోనూ ఫిబ్రవరి ఆఖరు వరకు వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. భక్తుల రద్దీ మేరకు అదనపు రైళ్ల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయలేదు. దీంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే చార్జీలు భారీగా ఉంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మాలధారణతోపాటే భక్తులు ప్రయాణ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ, చివరి నిమిషం వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొంటోంది.
ఒకే ఒక్క రైలు...
ఏటేటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ నుంచి 5 లక్షల మందికిపైగా శబరిమలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా. వారిలో చాలావరకు రైళ్లపైనే ఆధారపడతారు. ప్రైవేట్ వాహనాలు, విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య తక్కువే. రెగ్యులర్‌గా వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల వరకు టికెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. మరోవైపు ఈ నెలాఖరు నుంచే భక్తుల ప్రయాణా లు మొదలవుతాయి. జనవరిలో మకరజ్యోతి దర్శనం కోసం ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. కానీ, ఇందుకు తగినట్లుగా రైళ్లను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ‘‘సకాలంలో రైళ్లు వేయకపోవడం వల్ల పది, పదిహేనుమంది భక్తులు కలిసి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాన్ని బుక్ చేసుకొని వెళ్లవలసి వస్తుంది. ఇలా వాహనాలను బుక్ చేసుకున్న తరువాత ప్రత్యేక రైళ్లు వేస్తే ఏం లాభం’’అని బోడుప్పల్‌కు చెందిన అయ్యప్ప భక్తుడు సాంబశివరావు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి 5 లక్షల మందికిపైగా అయ్యప్ప భక్తులు
డిసెంబర్, జనవరి నెలల్లో శబరికి వెళ్లే రైళ్లలో భారీ రద్దీ
ఇప్పటికే వందల్లో వెయిటింగ్.. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ‘నో బెర్త్’
సంక్రాంతి ప్రయాణం కష్టమే.
ఈ సారి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు కూడా రైలు కష్టాలు తప్పేలా లేవు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంది. ఫిబ్రవరి వరకు కూడా వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు ఉంది. కొన్ని రైళ్లలో రిగ్రెట్ కనిపిస్తుంది. అయ్యప్ప భక్తులతోపాటు సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కూడా ప్రత్యేక రైళ్లను వేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హైటెక్ సిటీ తదితర ప్రధానస్టేషన్ల నుంచి ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి మొదటి వారం నుంచి ఇంచుమించు ఆ నెలాఖరు వరకు రోజుకు 50 వేల నుంచి లక్ష మంది చొప్పున అదనంగా ప్రయాణం చేయనున్నట్లు అంచనా.
సంక్రాంతి సందర్భంగా కనీసం 25 లక్షల మంది నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లి తిరిగి వస్తారు. ఈ మేరకు ముందస్తుగా అధికారులు రైళ్లను ప్రకటించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా తీరా పండుగ సమీపించాక అదనపు రైళ్లు వేస్తున్నారు. దీంతో అప్పటికే ప్రయాణికులు బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తారు. పైగా పండుగ ముందు అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే ఎగురేసుకుపోతున్నారు. సాధారణంగా శబరిమల ప్రత్యేక రైళ్లలో ఏటా ఇలాగే దళారుల దందా కొనసాగుతోంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడం వల్ల సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌లోనూ దళారులు పాగా వేసే అవకాశం ఉంది. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫకల్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో ఇప్పటికే భారీ వెయిటింగ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment